Walking After Meals is Good For Health : ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉద్యోగం, వ్యాపారం బిజీలో పడి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పని ఒత్తిడి, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. వంటివి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికీ నడక సరైన ఔషధం అని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే.. భోజనం తర్వాత కనీసం పది నిమిషాలు వాకింగ్(Walking) చేయాలని, దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : భోజనం చేశాక నడిస్తే.. జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తిన్నాక నడవడం వల్ల పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయని అంటున్నారు. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు.
2014లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తులు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిచినప్పుడు వారి జీర్ణక్రియ రేటు గణనీయంగా పెరిగిందని.. జీర్ణ అసౌకర్యం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ M.J. శాండ్స్ పాల్గొన్నారు. తిన్నాక నడవడం కడుపు, ప్రేగుల ఆరోగ్యానికి చాలా మంచిదని, జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది : తిన్న తర్వాత నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
బరువు తగ్గడానికి సహాయం : భోజనం తర్వాత నడక బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిన్నాక నడవడం వల్ల ఎక్కువ మొత్తంలో కేలరీలు బర్న్ అవుతాయని అది వెయిట్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందంటున్నారు. అలాగే ఈ సాధారణ వ్యాయామం కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందట.
మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారా? ఎన్ని నష్టాలో తెలుసా? ఇలా చేస్తే మంచిది!
గుండె ఆరోగ్యానికి మేలు : తిన్న తర్వాత నడక రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండెను బలపర్చడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది : ఈ సాధారణ వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. తిన్న తర్వాత నడక జీవక్రియ రేటును పెంచడంలో కూడా సహాయపడుతుందంటున్నారు.
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది : భోజనం తర్వాత చేసే ఈ సాధారణ వ్యాయామం మీ సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడం ద్వారా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, తగ్గిన ఒత్తిడి కూడా మరింత ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. తిన్న తర్వాత నడక కండరాలు, కీళ్లను బలపర్చడంలో చాలా బాగా సహయపడుతుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.