Health Benefits of Finger Millet : ఇవి పైకి చూడటానికి ఆవాలు లాగే చిన్నగా, సన్నగా కనిపిస్తాయి. కానీ, వీటిలో పోషక విలువలు మాత్రం దండిగా ఉండి.. ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవే.. రాగులు. అయితే, ఇప్పటికీ చాలా మంది రాగులు తినడానికి అంత ఆసక్తి చూపరు. కానీ.. వాటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం డైలీ డైట్లో అవి తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ.. రాగులలో ఎలాంటి పోషకాలుంటాయి? తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఏ విధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయంటున్నారు డాక్టర్ పెద్ది రమాదేవి. కాబట్టి డైలీ డైట్లో రాగులను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. వీటిలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే.. చెడు కొలెస్ట్రాల్ని అడ్డుకోవడంలో రాగులు సమర్థవంతంగా పనిచేస్తాయి. కనుక గుండె సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు డాక్టర్ పెద్ది రమాదేవి. అలాగే.. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు చాలా తక్కువగా ఉండి.. షుగర్ లెవల్స్ని కంట్రోల్లో ఉండడానికి తోడ్పడతాయి. కాబట్టి మధుమేహులకు ఇవి వరమని చెప్పుకోవచ్చంటున్నారు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఆహారం. చర్మం ముడతలు పడదు. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి.. మీ డైట్లో వీటిని చేర్చుకున్నారంటే వారం పదిరోజుల్లోనే మంచి మార్పు వస్తుందంటున్నారు.
అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తింటే కావలసినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు. 2018లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి బలంగా మారడానికి చాలా బాగా తోడ్పడతాయని కనుగొన్నారు.
ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు!
కొన్ని ప్రాంతాల్లో వీటితో రాగిసంకటి చేసి.. కూర, చారుతో తింటుంటారు. నిజానికి బియ్యంతో వండిన అన్నం కంటే ఇదెంతో శ్రేష్ఠమంటున్నారు నిపుణులు. అలాగే.. రాగిపిండితో జావ కాయొచ్చు, రొట్టెలు చేసుకొని తినొచ్చు. అటు జావ, ఇటు రొట్టెల్లో తీపి ఇష్టపడితే బెల్లం, లేదంటే కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవచ్చు. అలాగే.. దోశలపిండిలో రాగిపిండి కలిపితే.. అవి ప్రత్యేకంగానూ ఉంటాయి, పుష్టినీ ఇస్తాయి. అదేవిధంగా.. రాగిపిండితో హెయిర్‌మాస్క్ వేస్తే చుండ్రు పోతుంది, కురులు బాగా పెరుగుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రాగులను తరచూ ఏదో రూపంలో తిందామా మరి!
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
బియ్యం పిండి దోశలతో షుగర్ సమస్యా? - ఇలా "రాగి దోశలు" చేసుకోండి! - సూపర్ టేస్టీ, ఇంకా ఆరోగ్యం
ఏ వయసు వారు ఏం తింటే మంచిది - అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా?