Health Benefits of Eating Sweet Corn Daily: స్వీట్ కార్న్.. కాలాలతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఈ తియ్యటి మొక్కజొన్నలు లభిస్తాయి. వీటిని పచ్చిగా తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా, ఇతర పదార్థాలతో కలిపి వండుకుని తిన్నా రుచిగా ఉంటాయి. అయితే కేవలం రుచి మాత్రమే కాదు.. ఈ మొక్కజొన్నలతో తయారు చేసుకునే పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని పలు పోషకాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు. మరి డైలీ డైట్లో స్వీట్‌కార్న్ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం..
స్వీట్ కార్న్‌తో లాభాలు:
క్యాన్సర్‌కు చెక్: తియ్యటి మొక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా ఫెరూలిక్ ఆమ్లం, కుమారిన్ అనే యాంటి ఆక్సిడెంట్లు.. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
2017లో "జర్నల్ ఆఫ్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. స్వీట్‌కార్న్ వారానికి రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు తినే మహిళలకు స్థన(బ్రెస్ట్) క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17% తక్కువగా ఉందని కనుగొన్నారు. స్వీట్‌కార్న్‌లో ఫెరూలిక్ ఆమ్లం, కుమారిన్ అనే యాంటీఆక్సిడెంట్లు.. DNA నష్టాన్ని నివారించడంలో, కణాల వృద్ధిని నియంత్రించడంలో సహాయపడతాయి కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాన్ యాంగ్ పాల్గొన్నారు.
జీర్ణక్రియకు మంచిది: స్వీట్‌కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని.. ముఖ్యంగా మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి పరిష్కారమని అంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా స్వీట్‌కార్న్ తినమని సలహా ఇస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి: స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడతాయని వివరిస్తున్నారు.
కళ్ల ఆరోగ్యానికి మంచిది: స్వీట్‌కార్న్‌లో ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని.. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు. అలాగే వయసు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ వంటి కళ్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నాయి.
- తియ్యటి మొక్కజొన్నల్లోని ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయని చెబుతున్నారు.
- నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే వారికి స్వీట్ కార్న్ మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫినోలిక్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.