Health Benefits of Dry Coconut : సాధారణంగా చాలా మంది ఎండు కొబ్బరిని తీపి వంటకాలతో పాటు వివిధ రకాల కర్రీలలో యూజ్ చేస్తుంటారు. ఎండు కొబ్బరి వేయడం వల్ల వంటకాలకు మంచి రుచి వస్తుంది. ఇకపోతే.. మనందరికీ పచ్చి కొబ్బరి, కొబ్బరినీళ్లు(Coconut water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే, ఇవి మాత్రమే కాదు.. ఎండు కొబ్బరిని డైలీ తీసుకోవడం ద్వారా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. దానిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎండుకొబ్బరిలో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం, ప్రోటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా.. ఎండు కొబ్బరి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కాబట్టి, ఇన్ని పోషకాలు ఉన్నా ఎండు కొబ్బరిని డైలీ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.
రోగనిరోధ శక్తి పెరుగుతుంది : మీ శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే ఎండు కొబ్బరిని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయట. ఫలితంగా అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
గుండెకు మేలు : ఎండు కొబ్బరి తినడం గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచిస్తున్నారు. అలాగే ఎండుకొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
రక్త హీనతను తగ్గిస్తుంది : ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్ మీ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు.
మెదడుకి మేలు : బ్రెయిన్ పనితీరు మెరుగయ్యేందుకూ, మతిమరుపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో పోషకాల వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
ఎక్కువ నీళ్లున్న కొబ్బరిబోండాన్ని - ఎలా గుర్తించాలి? - Identify Full Water Coconut
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఎండు కొబ్బరి డైలీ తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా చేయడంలో తోడ్పడతాయంటున్నారు.
ఎముకలు బలంగా తయారవుతాయి : ఎండు కొబ్బరి తినడం వల్ల బోన్స్‌కు బలం చేకూరడంతో పాటు వాటిలోని పగుళ్ల శబ్దం కూడా ఆగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. దీనిలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
2018లో "ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ మెటబాలిజం" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎండు కొబ్బరి తినే వారిలో ఎముక విరిగే ప్రమాదం తగ్గుతుందని తేలింది. ఈ పరిశోధనలో దిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే ఎముకలకు సంబంధించిన నిపుణులు డాక్టర్ శ్రీనివాసన్ రామ్ పాల్గొన్నారు. ఎండుకొబ్బరిలో.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయని, అవి బోన్స్ స్ట్రాంగ్‌గా మారడానికి చాలా బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఎండు కొబ్బరిని తినడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను చాలా వరకు అడ్డుకుంటాయని సూచిస్తున్నారు నిపుణులు.
ఇవేకాకుండా.. ఎండుకొబ్బరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, తలనొప్పితో బాధపడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. చూశారుగా.. ఎండుకొబ్బరి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో, కాబట్టి మీరు కూడా డైలీ చిన్న ముక్కైనా ఎండుకొబ్బరి తినండని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.