Health Benefits Of Blood Donation : రక్తదానంపై ఇప్పటికీ చాలా మందికి పూర్తి అవగాహన లేదు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బలహీనత ఏర్పడుతుందని.. అనేక వ్యాధులకు దారితీస్తుందని అపోహ పడుతుంటారు. కానీ.. కొద్ది మందికి మాత్రమే రక్తదానం ఎలాంటి హానీ కలిగించదని తెలుసు. నిజానికి రక్తదానం చేయడం ద్వారా మనం ఒక వ్యక్తికి సహాయం చేయడమే కాకుండా.. మన శరీరానికి కూడా ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు నిపుణులు. ఇంతకీ.. రక్తదానం చేస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది : బ్లడ్ డొనేషన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. రక్తదానం చేయడం వల్ల మన రోగనిరోధక కణాలైన ల్యూకోసైట్ల సంఖ్య పెరుగుతుందట. ఇవి వివిధ వ్యాధులను మనల్ని రక్షించడంలో కీలకంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది : అధికబరువు ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల బరువును కోల్పోవచ్చంటున్నారు నిపుణులు. దీంతో పాటు బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఎనర్జీ కూడా పెరుగుతుందంటున్నారు. అలాగే, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో రక్తదానం సహాయపడుతుందంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు : మీరు క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల బాడీలో ఐరన్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంటే.. బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా శరీరంలోని అదనపు ఇనుము స్థాయిలు తొలగిపోతాయి. ఫలితంగా గుండెపోటు వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందంటున్నారు.
2019లో "Journal of the American College of Cardiology" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. క్రమం తప్పకుండా రక్తదానం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 49% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ డావిడ్ టి. లీ పాల్గొన్నారు. తరచుగా రక్తదానం చేసేవారిలో గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
'ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు ఎక్కువగా షుగర్, బీపీ- 50శాతం పెరిగిన మరణాలు' - Deaths With Health Issues
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : రక్తదానం బాడీలో ఐరన్ స్థాయిలు అధికంగా పేరుకుపోకుండా సహాయపడుతుందట. అదే రక్తంలో ఇనుము ఎక్కువగా ఉంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
మానసిక ఆరోగ్యానికి మేలు : రక్తదానం చేయడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మంచి సహాయం చేసిననే గొప్ప అనుభూతి మీకు కలుగుతుంది. అలాగే, ఇది మిమ్మల్ని రీఫ్రెష్‌గా ఉంచడమే కాకుండా ఆనందాన్ని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
రక్తదానం చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు :
- ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా, ఎప్పుడైనా రక్తాన్ని డొనేట్ చేయొచ్చు. ఒకసారి 350-400 మి.లీ. రక్తాన్ని సురక్షితంగా ఇవ్వచ్చు. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయొచ్చు. అయితే, కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు.
- రక్తదానం చేసిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతి అవసరం. ఎందుకంటే.. కొందరిలో ఫిజికల్ వీక్నెస్, నొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
- ఎనర్జీ కోసం ఐరన్ ఉన్న ఆహారాన్ని పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
- అలాగే బ్లడ్ డొనేషన్ తర్వాత డిహైడ్రేషన్ కాకుండా నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవచ్చంటున్నారు.
- అంతేకానీ.. అన్‌హెల్తీ ఫుడ్స్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకోరాదు. అదేవిధంగా వెంటనే వ్యాయామం చెయ్యకూడదనే విషయాన్ని మీరు గమనించాలి.
- చివరగా మీకు ఏదైనా.. ఆరోగ్య సమస్య ఉంటే రక్తదానం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ శరీరం నుంచి ఈ రకమైన దుర్వాసన వస్తోందా? - అయితే, మీకు డయాబెటిస్ ఖాయం!