Green Tea Side Effects : కాఫీ, టీలు తాగడం కంటే గ్రీన్ టీ తాగడం చాలా మంచిదని అందరూ అనుకుంటారు. ఈ గ్రీన్ టీ వల్ల బరువు తగ్గి నాజూగ్గా తయారవ్వచ్చని మరికొందరు భావిస్తుంటారు. అందుకే గ్రీన్ టీ తాగే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మితంగా గ్రీన్ టీ తాగితే ఫర్వాలేదు. కానీ, అతిగా గ్రీన్ టీ తాగితేనే సైడ్ ఎఫెట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కెఫెన్ వల్ల సమస్యలు :
మనం తాగే టీ, కాఫీల్లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో పోల్చితే గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ అతిగా గ్రీన్ టీ తీసుకుంటే, మన శరీరంలోకి అతిగా కెఫిన్ చేరుతుంది. దీని వల్ల నిరుత్సాహం, భయం, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, రక్తపోటు, హృదయ స్పందనల వేగం పెరగడం సహా, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. గుండె సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఐరన్ గ్రహించడంలో సమస్య :
మన శరీరానికి అందాల్సిన పోషకాల్లో ఐరన్ ఎంతో ముఖ్యమైనది. అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగే వారిలో ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మనం శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మనలో రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే పరగడుపున కాకుండా, ఆహారంతోపాటే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
ఉదర సమస్యలు :
అతిగా గ్రీన్ టీ తాగే వారిలో ఉదర సమస్యలు ఏర్పడతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సహా అనేక చికాకులు వస్తాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి.
ఫ్లోరోసిస్ సమస్య :
ఫ్లోరైడ్ అధికంగా ఉండే ప్రాంతాల్లో గ్రీన్ టీ మొక్కలు పెంచుతూ ఉంటారు. కనుక అవి అధికంగా ఫ్లోరైడ్‌ను శోషించుకుంటాయి. ఇలాంటి వాటి నుంచి తయారైన గ్రీన్ టీని ఎవరైతే తాగుతారో వారికి కూడా ఫ్లోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల మన దంతాలు, ఎముకలు మొదటిగా రంగు మారిపోతాయి. తరువాత క్రమంగా బలహీన పడిపోతాయి.
మందుల శోషణ:
గ్రీన్ టీ అనేది కొన్ని రకాల మందులతో సమ్మిళితం అవుతుంది. ముఖ్యంగా బీటా-బ్లాకర్స్, బ్లడ్ థిన్నర్స్, యాంటీసైకోటిక్ మందులతో చర్యలు జరుపుతుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొన్ని రకాల మందులు వాడేటప్పుడు గ్రీన్ టీ తాగవచ్చా? లేదా? అనేది మీ డాక్టర్‌ను అడిగి తీసుకోవాలి.
ముఖ్య గమనిక :
ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టేస్టీగా ఉందని సాస్ లాగించేస్తున్నారా? - మీ శరీరంలో జరిగేది ఇదే!
కాఫీ Vs టీ- రెండిట్లో ఏది బెస్ట్? మార్నింగ్ లేవగానే తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?