Good Sleep Tips in Telugu: మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మంచం ఎక్కి చాలాసేపైనా సరే.. నిద్ర రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇంకా గర్భిణుల్లో అయితే ఈ సమస్య కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట పెరగడం వల్ల ఆయాసంగా, అసౌకర్యంగా అనిపించి తద్వారా నిద్ర పట్టదు. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
టైం సెట్ చేసుకోండి!
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ చెబుతున్నారు. అలాగే పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం.. వంటి అలవాట్ల వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు.
వ్యాయామం చేయండి
ప్రెగ్నెన్సీ నిర్థరణ అయ్యాక ఏ పనీ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు కొంతమంది. అయితే అది కరెక్ట్ కాదని అంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలతో ఉంటూ.. డాక్టర్లు సలహా ఇస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోవడం అవసరం లేదంటున్నారు. ఈ క్రమంలో తేలిక పాటి వ్యాయామం చేయడం వల్ల తల్లితో పాటు బిడ్డకు మేలు చేస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉండి.. రాత్రి హాయిగా నిద్రపోతారని వెల్లడించారు. అలాగని రాత్రి పడుకునే ముందు కాకుండా.. వైద్యులు సూచించిన సమయంలోనే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
ఒత్తిడికి దూరంగా!
మన రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా రాత్రి పూట నిద్ర పట్టకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో, ఆఫీసులో ఉండే పలు సమస్యలు, ప్రసవం గురించిన భయాలు నిద్రలేమికి దారితీస్తాయని చెబుతున్నారు. దీనివల్ల మీతో పాటు కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కవగా ఆలోచించకుండా ఒత్తిడిని దూరం చేసుకొని హాయిగా నిద్రపోవాలని పేర్కొన్నారు. అలాగే పడుకోవడానికి కనీసం గంట ముందు తల, కాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకోవాలని నిపుణలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్ర పడుతుందని అంటున్నారు నిపుణులు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బరువు తగ్గాలా? రోజు తినేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలట! సన్నగా మారిపోతారట!!
చలికాలంలో ఇది తీసుకుంటే మీ ఇమ్యూనిటీ డబుల్! రోగాలు రాకుండా కాపాడుతుందట!