Food Items Not Keep In Fridge : ప్రస్తుత రోజుల్లో ఫ్రిజ్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఆహార పదార్థాలతోపాటు ఇతర వస్తువులను స్టోర్ చేసుకునేందుకు రిఫ్రిజిరేటర్‌ను తెగ కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే ఫ్రిజ్ ఖాళీగా ఉందని ఏదిపడితే అది పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి కనుక వాటిని తగిన ఉష్ణోగ్రతలోనే ఉంచాలని సూచిస్తున్నారు. అయితే ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలేంటి? అలా నిల్వ చేస్తే జరిగే అనర్థాలేంటో ఓ సారి తెలుసుకుందాం.
1. బ్రెడ్
ఫ్రిజ్‌లో బ్రెడ్ నిల్వచేయవచ్చా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే బ్రెడ్ స్టార్చ్‌లో ఉండే అణువులు చల్లని ఉష్ణోగ్రతకు చాలా త్వరగా రీక్రిస్టలైజ్ అవుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారి రుచిని కోల్పోతుంది. అందుకే బ్రెడ్‌ను ఓ బాక్స్‌లో స్టోర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
2.టమాటాలు
టమాటాలను వంట గదిలోనే నిల్వ చేయాలి. వాటిని ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచిలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
3. తేనె
తేనెను ఫ్రిజ్‌లో పెడితే దాని రుచిని కోల్పోతుంది. ఫ్రిజ్‌లో ఉంచే బదులు ఒక కంటైనర్‌లో నిల్వ చేసి చీకటి ప్రదేశంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
4. అవకాడో
అవకాడోలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటిని వంటగదిలోనే ఉంచడం మంచిది.
5.పుచ్చకాయలు
పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. లేదంటే వాటిని ముక్కలుగా కోసిన తర్వాతే ఫ్రిజ్‌లో నిల్వచేయాలని చెబుతున్నారు.
6.వెల్లుల్లి
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో స్టోర్ చేయకూడదని, అలా చేస్తే తేమ పేరుకుపోయి వెల్లుల్లి త్వరగా పాడవుతాయని చెబుతున్నారు.
7.స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల తేమను పీల్చుకుని రుచిని కోల్పోతాయి. వాటిని బహిరంగ ప్రదేశంలోనే ఉంచడం మంచిది. లేదంటే కొనుగోలు చేసిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే తినేయాలి.
8.కాఫీ
కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని కాఫీ పౌడర్ పీల్చేస్తుంది.
9.ఉల్లిపాయలు:
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
10.అరటి:
అరటిపండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఫ్రిజ్‌లో పెడితే అవి త్వరగా పాడవుతాయి. వెచ్చని ఉష్ణోగ్రతలో ఉంచితే పండు పూర్తిగా పక్వానికి వస్తుంది.
11.చాక్లెట్లు
చాక్లెట్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచితే ఇతర ఆహార పదార్థాల వాసనను అవి పీల్చుకుని స్థిరత్వాన్ని కోల్పోతాయి. ఫ్రిజ్‌లో ఉంచిన చాక్లెట్లను తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
12.బంగాళదుంపలు
బంగాళదుంపలను బయట ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం మంచిది. ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. చల్లటి ఉష్ణోగ్రత బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్‌ను షుగర్‌గా మార్చేస్తుంది. ఫలితంగా అవి మరీ తియ్యగా లేదా గట్టిగా అయిపోతాయి. దీంతో అవి వంటకు పనికిరాకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు.
13. మూలికలు
తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లయితే అవి ఎండిపోతాయి. ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో వేసి గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో ఉంచాలి. లేదంటే వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచొచ్చు. వీటితోపాటు కిరాణా వస్తువులను ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేసి, ఫ్రిజ్‌లో ఉంచి వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు.