Food for Type 1 Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం సహా ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. అయితే పెద్దవారితో పోలిస్తే చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటిస్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాగే వాళ్లకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి అని కూడా ఆలోచిస్తుంటారు. మరి దీనిపై నిపుణుల సమాధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
టైప్ 1 డయాబెటిస్ అంటే: టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. మానవ శరీరంలోని క్లోమ గ్రంథిలో (Pancreas) ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలను రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్నే టైప్ 1 మధుమేహం అంటారు. సాధారణంగా పిల్లలు, యువకులలో ఈ పరిస్థితి ఉంటుంది. దీన్ని గతంలో ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్’ (IDDM) లేదా ‘జువెనైల్ డయాబెటిస్’ అని పిలిచేవారు. ఇక లక్షణాలు చూస్తే.. అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అధిక ఆకలి, అలసట, బరువు తగ్గడం, తలనొప్పి, వికారం, వాంతులు వంటివి కనిపిస్తాయి. మరి టైప్ 1 డయాబెటిస్తో బాధపడే పిల్లలకు ఎటువంటి ఫుడ్ పెట్టాలంటే..
ఆహార నియమాలు: సాధారణంగా పెద్దవాళ్లలో వచ్చే డయాబెటిస్‌కీ, చిన్నారుల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌కీ తీసుకునే ఆహార నియమాలు వేరుగా ఉంటాయని ప్రముఖ పోషకహార నిపుణురాలు డా. జానకీ శ్రీనాథ్ తెలిపారు. చిన్నపిల్లల్లో ఎదుగుదల ఉంటుంది కాబట్టి.. మామూలు పిల్లల మాదిరిగానే వీరికి అన్ని రకాల ఆహారాలు పెట్టవచ్చని సూచిస్తున్నారు. కాకపోతే ఇన్సులిన్ మోతాదు, దాన్ని ఇచ్చే సమయం, ఎత్తు, బరువుని దృష్టిలో పెట్టుకుని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందంటున్నారు. అలాగే వీటితో పాటు బ్లడ్ షుగర్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయేమో గమనించాలని.. బరువు తగ్గకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆటలు ఎక్కువ ఆడుతున్నా.. కొత్త ఆటలు ఏమైనా మొదలు పెట్టినా కూడా చక్కెర స్థాయుల్లో మార్పులు రావచ్చని.. వీరిలో ఇన్సులిన్ టైమ్ ప్రకారం పనిచేస్తుంది కాబట్టి ఆహార వేళలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇచ్చే ఆహారంలో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం ఎక్కువ ఉండేలా చూసుకోవాలంటున్నారు. అందుకోసం..
- ఉదయం అల్పాహారంగా.. పాలతో కలిపిన ఓట్స్, చపాతీ, పెసరట్టు, ఉడికించిన గుడ్డు పెట్టొచ్చంటున్నారు.
- మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌రైస్, దంపుడు బియ్యాన్ని మాత్రమే వాడాలని.. వీటితో పాటు కాయగూరలతో కలిపి ఆమ్లెట్ పెట్టాలంటున్నారు.
- సాయంత్రం చిరుతిండిగా మొలకలు, నట్స్, వెజ్‌సూప్, ఉడికించిన శనగలు, గ్లాసు పాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
- రాత్రి భోజనంలో మిల్లెట్స్‌తో చేసిన రోటీ, పుల్కా, ఉడికించిన కాయగూరలు, కప్పు పెరుగన్నం పెట్టాలని అంటున్నారు.
- పండ్ల విషయానికి వస్తే చక్కెర తక్కువ, పీచుపదార్థం ఎక్కువుండే బత్తాయి, జామ, ఆరెంజ్, డ్రాగన్‌ఫ్రూట్ వంటివి పెట్టాలంటున్నారు.
ఇవి కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వేసవి కాబట్టి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఇస్తూ ఉండాలంటున్నారు. ఐస్‌క్రీమ్, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచాలని ఆమె సూచిస్తున్నారు.
మీకు షుగర్ ఉందా? - అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి అస్సలు తినకూడదు! - Sugar Patients Avoid Breakfast Food