How to Wean Children Chips Eating : చిప్స్.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. ఇక పిల్లలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో తయారు చేసిన ఆహారం కన్నా చిప్స్‌నే ఎక్కువగా తింటుంటారు. అయితే, ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ.. తరుచుగా తింటుంటే మాత్రం వెంటనే ఆ అలవాటును మాన్పించడం మంచిదంటున్నారు ప్రముఖ న్యూటిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. చిప్స్(Chips) తరచూ తినడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఇంతకీ.. చిప్స్ తినడం పిల్లల ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? ఈ అలవాటును మాన్పించాలంటే ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాధారణంగా చిప్స్‌లో రెండు రకాలుంటాయి. వాటిలో ఒకటి.. బంగాళాదుంప(Aloo), అరటి వంటి వాటితో చేసేవి కాగా, మరొకటి.. పిండితో ప్రిపేర్ చేసుకునేవి ఉంటాయి. ఇందులో వేటినైనా ఆయిల్లో ఎక్కువగా వేయిస్తారు. ఇందులో ఇంట్లో చేసినవయితే కాస్త పర్వాలేదు. కానీ.. అదే బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి చిప్స్‌ని ప్రిపేర్ చేస్తుంటారు. వీటివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కంటి చూపు కోల్పోవచ్చు! : పిల్లలు చిప్స్ తింటే చాలు.. వాళ్ల పొట్ట వెంటనే నిండిపోతుంది. దీంతో వేరే ఆహారం తినాలనిపించదు. అయితే.. మీ పిల్లలూ చిప్స్ ఎక్కువగా తింటున్నట్టయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అవేంటంటే.. చిప్స్‌లో కెలోరీలు అధికంగా ఉంటాయి. అలాగే.. వీటి ద్వారా శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దాని కారణంగా.. ఐరన్, జింక్, విటమిన్-ఎ, సి లోపాలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు.. త్వరగా అలసిపోవడం, ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం, చివరకు కంటిచూపును(Eyesight) కోల్పోయే పరిస్థితి కూడా పిల్లల్లో రావొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మీ పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటున్నట్లయితే ఇప్పుడే ఈ అలవాటును మాన్పించాలని సూచిస్తున్నారు.
చిప్స్ తినే అలవాటును ఎలా మాన్పించాలంటే?
- పిల్లలు ఒక్కసారిగా చిప్స్ తినడాన్ని మానుకోలేరు. కాబట్టి.. నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలంటున్నారు.
- అందుకోసం వారం పదిరోజులకోసారి చిప్స్ ఇస్తూ.. అవి అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వారికి అర్థమయ్యేలా చెబుతుండాలి.
- అదేవిధంగా.. పిల్లల రోజువారీ భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రంగుల పండ్లూ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
- ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటైతే.. వాళ్లే క్రమంగా చిప్స్ అడగడం మానేస్తారని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
బిగ్ అలర్ట్ : మీకు ఈ చిప్స్ తినే అలవాటు ఉందా? - మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి!
చిప్స్ ప్యాకెట్లలో సగానికిపైగా గాలితోనే నింపుతారు! - ఎందుకో మీకు తెలుసా?