Drinking Raw Milk Risks : ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు పాలను కచ్చితంగా అందించాలని సూచిస్తుంటారు. అయితే, ప్రస్తుత కాలంలో కొంత మంది ఆరోగ్యానికి ఎంతో మంచివని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పచ్చి పాలు తాగుతుంటారు. ఇలా పచ్చిపాలను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులంటున్నారు. మరి పచ్చిపాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి ? పాలను ఎలా తాగితే మంచిది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మార్కెట్లో దొరికే ప్యాకెట్ పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కొద్దిసేపు వేడి చేసి, చల్లార్చిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఈ పాలను ప్యాశ్చరైజ్డ్ మిల్క్ (Pasteurized Milk) అని అంటారు. అయితే, ఇలా పాలను వేడి చేసి చల్లార్చడం ద్వారా.. అందులోని క్రిములు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ప్యాశ్చరైజ్డ్ మిల్క్‌లో కంటే పచ్చి పాలలోనే ఎక్కువ విటమిన్‌లు, పోషకాలు ఉంటాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదట. ప్యాకెట్ పాలలోనూ.. మనం ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
పచ్చిపాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు :
జీర్ణ సమస్యలు: పచ్చిపాలలో సాల్మొనెల్లా, ఇ-కొలి, లిస్టెరియా మోనోసైటోజెనెస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటివల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2017లో "యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. లాక్టోస్ ఇంటాలరెన్స్ (Lactose intolerance) ఉన్న వారు పచ్చిపాలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ డెన్‌హోమ్ పాల్గొన్నారు. పచ్చిపాలు తాగిన కొంతమందిలో వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు.
అలెర్జీలు: కొంతమందికి పాల పదార్థాలు అంటే అలెర్జీ ఉండవచ్చు. ఈ క్రమంలోనే పచ్చిపాలు తాగడం వల్ల దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి అలాంటివారు పాలు తాగకపోవడమే మంచిదంటున్నారు.
పోషకాల నష్టం: పాశ్చరైజేషన్ ప్రక్రియలో కొన్ని పోషకాలు నాశనమవుతాయి. అయితే ఈ ప్రక్రియ వల్ల పాలలోని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది. అయితే, పచ్చిపాలను తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్లు మరియు యాంటీబయాటిక్స్: పచ్చి పాలలో పశువులకు ఇచ్చే హార్మోన్లు, యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అవశేషాలు మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయని అంటున్నారు. ఇదే విషయాన్ని పలు పరిశోధనలు సైతం ధృవీకరించాయి. 2013లో "Environmental Health Perspectives" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం.. పచ్చిపాలలో పశువులకు ఇచ్చే హార్మోన్లు, యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవచ్చని కనుగొంది. ఇవే కాకుండా
- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చిపాలను తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
- అలాగే పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పచ్చిపాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పాలను ఎలా తాగితే మంచిది ?: ఏ వయసు వారైనా సరే పచ్చి పాలను తాగడం కన్నా వేడి చేసి చల్లారిన తర్వాత తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.