Drinking Lemon Water In Empty Stomach Benefits : పొద్దున లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనకు తెలుసు. ఈ అలవాటు మొత్తం శరీరానికి మేలు చేస్తుందని పెద్దలు, నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే కేవలం నీరు మాత్రమే కాకుండా అందులో కాస్త నిమ్మకాయ కలుపుకుని తాగితే ఎలా ఉంటుంది? ప్రతి రోజు పరగడుపున టీ, కాఫీలకు బదులుగా నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
జీర్ణక్రియ మెరుగవుతుంది
నిమ్మకాయ నీరు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం అరుగుదలకు చక్కగా తోడ్పడుతుంది. అలాగే దీంట్లో సహజంగా లభించే సిట్రిక్ యాసిడ్ మూత్రవిసర్జన సమస్యలు లేకుండా చేస్తుంది.
బరువు నియంత్రణ
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ శరీరానికి హాని చేసే టాక్సిన్లను, అదనంగా ఉన్న నీటి శాతాన్ని బయటకు పంపించేందుకు సహాయపడుతుంది. పైగా ఇందులోని ఫైబర్ ఆకలి కోరికలకు అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి అతిగా తిని, బరువు పెరగకుండా ఉంటారు.
చర్మ సౌందర్యం
నిమ్మకాయలోని విటమిన్-సీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి మృదువైన, మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. రోజూ నిమ్మరసం తాగడం వల్ల ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా, యవ్వనంగా కనిపిస్తారు.
నిర్విషీకరణ
శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు. ఇందుకోసం రోజంతా నీరు తాగడం, ఎనర్జీ డ్రింక్స్, సోడా లాంటి వాటిని తాగడం చేస్తుంటారు. నిజానికి సిట్రస్ జాతి పండ్లలో శరీరంలోని వేడిని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు హానికరమైన టాక్సిన్ల నుంచి కూడా తప్పించుకోవచ్చు.
ఇన్ఫ్లమేషన్
నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడి, మంట, వాపు లాంటి సమస్యల నుంచి పోరాడే శక్తనిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు నిమ్మకాయ నీరు మీకు బాగా ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడంలో విటమిన్-సీ కీలకంగా వ్యవహరిస్తుంది. నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలతో నిండి ఉంటుంది. క్రమం తప్పకుండా నిమ్మరసాన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఉదయన్నే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి.
వేసవిలో అమృతం నిమ్మరసం! తాగితే ఎన్ని లాభాలో.. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం..