Dragon Fruit Benefits : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్ల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ప్రకృతి ప్రసాదించే ఈ ఫలాలను తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 400 గ్రాముల పండ్లు తినాలి. వీటిలోని ఎన్నో పోషకాలు అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి.. ముప్పు నుంచి తప్పిస్తాయి. అయితే.. ఎలాంటి పండ్లు తినాలనే విషయంలో అందరికీ కొంత అవగాహన ఉంటుంది. కానీ.. డ్రాగన్ ఫ్రూట్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. మరి.. ఈ పండు నిజంగా మంచిదేనా? ఇది తింటే శరీరంలో ఏం జరుగుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొంత కాలంగా డ్రాగన్ ఫ్రూట్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. గతంలో దిగుమతి అయ్యే ఈ విదేశీ పండును.. ఇప్పుడు మన దేశంలో విస్తారంగా పండిస్తున్నారు. దీంతో.. అన్ని ప్రాంతాల వారికీ ఇది అందుబాటులో ఉంది. పట్టణాలు, నగరాల్లో తోపుడు బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. మరి, ఈ పండు తినడం మంచిదేనా? మన ఆరోగ్యానికి ఇది ఎలాంటి మేలు చేస్తుంది? శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్లో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఫైబర్ ఎంతో అవసరం. ఇది తగినంత శరీరానికి అందకపోతే.. మలబద్ధకం తీవ్రంగా వేధిస్తుంది. దీనివల్ల ఎన్నో రోగాలు చుట్టుముడతాయి. ఈ పీచు పదార్థం డ్రాగన్ ఫ్రూట్లో పుష్కలంగా ఉంటాయి. ఇదేకాకుండా.. ఐరన్, జింక్, మాంసకృత్తులు, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఈ పండులో దండిగా ఉంటాయి. నీరసంగా ఉన్నవారు.. ఆ పరిస్థితి నుంచి వెంటనే తేరుకోవాలంటే.. డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కొన్ని తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఓ పరిశోధన తేల్చింది. "ఫుడ్ & ఫంక్షనల్ ఫుడ్స్" జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ రీసెర్చ్‌లో వైద్యులు W. Zhou, Z. Y. Lin పాల్గొన్నారు. గుండెకు డ్రాగన్ ఫ్రూట్ మంచిదని తేల్చారు.
క్యాన్సర్ ముప్పునూ అడ్డుకుంటుంది..
ఈ డ్రాగన్ ఫ్రూట్లో "పిటయా" అనే పోషక పదార్థం ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుంది. ఇక, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దేహానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ తో ధీటుగా పోరాడుతుంది. వాటిని నాశనం చేయడం ద్వారా.. క్యాన్సర్ ముప్పును అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్స్, వంటివి షుగర్ ను అదుపు చేస్తాయట.
ఇంతేనా..
ఈ డ్రాగన్ ఫ్రూట్ గింజల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయట. ఇందులోని మెగ్నీషియం హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇందులో వాటర్ కంటెంట్, పీచు చాలా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తూ.. బరువూ తగ్గడానికీ కారణం అవుతుందట. అంతేకాదు.. రక్తహీనతతో బాధపడుతున్న వారు.. ఆ పరిస్థితిని అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఏ మాత్రం అవకాశం ఉన్నా డ్రాగన్ ఫ్రూట్ తినాలని సూచిస్తున్నారు.