Never Do These Things After Eating Food : కొంతమందికి భోజనం కాగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ.. తిన్న తర్వాత వీటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీటిలో ఉండే టానిన్లు, కొన్ని రకాల ఆమ్లాలు ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తిని తగ్గిస్తాయంటున్నారు. ఫలితంగా జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు.
2000లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు కాఫీ తాగిన వ్యక్తులకు, కాఫీ తాగని వారి కంటే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇటలీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ M.మారాగో పాల్గొన్నారు. భోజనం చేశాక కాఫీ, టీ తాగే వారిలో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వాటర్ ఎక్కువగా తీసుకోవద్దు : మనం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండడానికి తగినంత వాటర్ తాగడం చాలా అవసరం. కానీ.. భోజనం తర్వాత ఎక్కువ నీళ్లు తాగడం మానుకోవాలంటున్నారు నిపుణులు. అలా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి, పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్, జీర్ణ రసాలు తక్కువగా విడుదల అవుతాయి. దాంతో ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాదు, శరీరంలో టాక్సిన్లు విపరీతంగా పెరుగుతాయి. అందుకే భోజనానికి గంట ముందూ లేదా తిన్నాక గంట తరవాత నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు.
అలర్ట్: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!
స్నానం చేయొద్దు : ఆహారం తినగానే కొంతమందికి స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ, ఇది సరికాదని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ రక్త ప్రసరణ అవసరం. అందే మీరు స్నానం చేయడంతో రక్త ప్రసరణ చర్మం వైపు వెళ్లి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దాంతో.. జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ కావాల్సి వస్తుంది. ఫలితంగా అజీర్తి, స్కిన్ అలర్జీలు వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
నిద్రపోవడం మానుకోవాలి : భోజనం చేసిన తర్వాత చాలామందికి ఓ కునుకు వేయడం అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కొందరు ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చామనో లేక ఇంకేదైనా కారణంతో తిన్న వెంటనే నిద్రపోతుంటారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల కొవ్వులు నిల్వ అయి బరువు పెరుగుతారని సూచిస్తున్నారు. అంతేకాదు.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి.. భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు నడవాలని చెబుతున్నారు.
పండ్లు తినకూడదు : భోజనం చేశాక కొంతమంది పండ్లు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ, అది ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. తిన్నాక కడుపు నిండి భావన కలుగుతుంది. అప్పుడు మళ్లీ పండ్లు తింటే ఈ రెండూ జీర్ణమవ్వడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. బరువు పెరగడానికి కారణమవ్వొచ్చు. అందుకే.. భోజనం తర్వాత పండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.