Chicken and Milk Effect on Puberty in Girls: ఒకప్పుడు ఆడపిల్లలు 12 నుంచి 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యేవారు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా రజస్వల వయసు కూడా మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు 9, 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతుండగా.. కొందరైతే 8 ఏళ్లకే అవుతున్నారు! అయితే, ఇందుకు కారణం ఇప్పుడు తినే చికెన్, గుడ్లు, ప్యాకెట్ పాలు అని భావిస్తున్నారు కొంతమంది. మరి.. ఇది ఎంత వరకు నిజం? దీనిపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? చిన్న వయసులోనే ఈ సమస్యతో పాటు.. ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కోకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో అమ్మాయిలు తీసుకునే ఆహారం కూడా ఒక కారణమై ఉండొచ్చంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ముఖ్యంగా ఇప్పుడు దొరికే మటన్, చికెన్‌లలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయని అందరూ అనుకుంటుంటారు. ఇక పాల విషయానికి వస్తే.. బర్రెలకీ, ఆవులకీ పాల ఉత్పత్తిని పెంచడానికి హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చినపుడు అవి పాలు, పాలతో చేసిన ఆహార పదార్థాల ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తాయి.
అప్పుడు అవి శరీరంలోని హార్మోన్లతో కలిసినపుడు వాటి సమతౌల్యం దెబ్బతినడంతో త్వరగా రజస్వల అవొచ్చంటున్నారు. అయితే, అందరికీ ఇలాగే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఒక్కోసారి ఒకే రకమైన ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకున్నా ఈ సమస్య ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి.. ఏదేమైనప్పటికీ అమ్మాయిలు మరీ చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలా జరగకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలంటున్నారు.
అలర్ట్ : పిజ్జా, చిప్స్ తింటే చిన్నవయసులోనే "పెద్ద మనిషి" అయిపోతారు! - షాకింగ్ రీసెర్చ్!
- అందులో ముఖ్యంగా ఆడపిల్లలు క్రమపద్ధతిలో ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్. అలాగే.. కొన్ని పరిశోధనలూ మాంసాహారం, ఆకుకూరలు, పాలు, పీచు పదార్థాలను సరైన మోతాదులో తీసుకునే వారిలో యుక్త వయసు రాకముందే మెచ్యూర్ అవ్వడం వంటి సమస్యలు ఉండటం లేదని చెబుతున్నాయని వివరిస్తున్నారు.
- అదేవిధంగా.. అమ్మాయిలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారిలో కొవ్వులు పెరగకుండా చూసుకోవాలి. అలా జరగకుండా చూసుకోవాలంటే నాన్‌వెజ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కాబట్టి.. చికెన్ ఇష్టంగా తింటుంటే రోజుకి 75 గ్రా. మించి ఇవ్వొద్దట. ఒకవేళ ఉడికించిన గుడ్డుతో అయితే 50 గ్రా.లు మాత్రమే పెట్టాలని.. అది కూడా డీప్‌ఫ్రై, గ్రేవీ లేకుండా పెట్టాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
- అలాగే.. 300 మి.లీ. టోన్డ్ మిల్క్ లేదా వాటికి సమానంగా పాలతో చేసిన పదార్థాలు అందించాలి. ఒకవేళ పాలు వద్దనుకుంటే.. రాగులతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వమంటున్నారు. వీటితో కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభించి ఆరోగ్యంగా ఉంటారంటున్నారు.
- అదే నాన్‌వెజ్ పెట్టకూడదనుకుంటే.. అందుకు సరితూగే పప్పుదినుసులు అంటే శనగలు, అలసందలు, పెసలు, గుగ్గిళ్లు, పెసరట్టు, ఢోక్లా వంటివి చేసి పెట్టవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
- ఈ ఆహార నియమాలు పాటించడమే కాకుండా వారికి డైలీ కాస్త శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు. అంటే.. ఆటలు ఆడించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.