Health Benefits of Eye Masks : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. కానీ.. ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, పని ఒత్తిడి, పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కారణంగా ఎక్కువ మంది తగినంత నిద్రపోవట్లేదు. ఇది క్రమంగా నిద్రలేమి సమస్యకు దారితీస్తోంది. దీన్ని ఆలస్యంగా గుర్తిస్తున్న జనం.. ఇందులో నుంచి బయటపడడానికి కళ్లకు ఐ మాస్క్‌లు ధరించి నిద్రపోతున్నారు. మరి.. నిజంగానే వీటివల్ల ఉపయోగం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"స్లీప్ జర్నల్" ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు కళ్లకు "ఐ మాస్క్" ధరించడం మంచిదేనట. కొంత మంది లైట్ వెలుగుతూ ఉంటే నిద్రపోలేరు. కళ్లు మూసుకొని పడుకున్నప్పటికీ.. లైట్ ఆఫ్ చేయాలని కోరుతుంటారు. ఎందుకంటే.. కళ్లు ఆ కాంతిని పసిగడతాయి. దీనివల్ల నిద్రాభంగం అవుతుంది. ఇలాంటి పరిస్థితిని స్లీప్ మాస్క్ అడ్డుకుంటుందట. దీనివల్ల చక్కటి నిద్ర సొంతమవుతుందని.. మరుసటి రోజు చురుకుదనంతో నిద్రలేస్తారని, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే కృత్రిమ కాంతిని నివారించడంలో స్లీప్ మాస్క్‌లు చాలా బాగా సహాయపడతాయని తేలింది.
2010లో "నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్"లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్న రోగులు స్లీప్ మాస్క్ ధరించి నిద్రలో ఎక్కువ సమయం గడపగలిగారట.
7 - 8 గంటలు పడుకున్నా ఉదయం చిరాగ్గా నిద్ర లేస్తున్నారా? - కారణాలు పెద్దవే!
నిద్రపోయేటప్పుడు ఐ మాస్క్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు :
- ఒత్తిడిని తగ్గిస్తుంది : ఐ మాస్క్‌లు మీ కళ్లపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని ద్వారా.. మీకు విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్ర దక్కుతుంది. మార్కెట్లో లభించే చాలా ఐ మాస్క్‌లు మృదువైన ఆకృతితో ఉంటాయి. ఇవి మీకు విశ్రాంతి అనుభూతిని ఇచ్చే కుషనింగ్‌ను కలిగి ఉంటాయి.
- కళ్లను తేమగా ఉంచుతాయి : స్లీప్ మాస్క్‌లు మీ కళ్లను తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మీరు పొడి వాతావరణంలో నివసిస్తుంటే లేదా ఏసీ గదిలో నిద్రిస్తే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- కాంతిని అడ్డుకుంటాయి : పడుకోవడానికి ముందు "ఐ మాస్క్‌లు" ధరిస్తే.. ఇవి కాంతిని అడ్డుకోవడంతోపాటు, కళ్లపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఇవి మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడినప్పటికీ.. ఇతర మానసిక కారణాల వల్ల కలిగే నిద్ర ఇబ్బందులకు అవి పనికిరావని నిపుణులు సూచిస్తున్నారు.
- ముఖ్యమైన విషయం ఏమంటే.. పని, ఇతరత్రా కారణాలతో చాలా మంది ఒక షెడ్యూల్ అన్నది లేకుండా నిద్రపోతుంటారు. దీనివల్ల ఒక టైమ్ టేబుల్ అలవాటు కాదు. ఫలితంగా మన శరీరం మెలటోనిన్ స్థాయిలు ఎఫెక్ట్ అవుతాయి. దీంతో నిద్రకు మరింత ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. రోజూ తగినంత నిద్రపోయేలా ఒక టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.