Dehydration Symptoms In Telugu : మన శరీరంలో అన్ని విధులు సక్రమంగా జరగాలంటే నీరు చాలా అవసరం. శరీరానికి అవసరమైన నీరు అందకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఒంట్లోని శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డీహైడ్రేషన్ మరింత ప్రమాదకరమనే చెప్పాలి. కాబట్టి ఎప్పుడూ నీరు ఎక్కువగా తాగుతుండాలి. మీ శరీరానికి అవసరమైన నీటిని మీరు తాగుతున్నారా లేదా అని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్, డెర్మోస్పియర్ క్లినిక్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ దీపక్ జాఖర్ MBBS, MD తెలిపారు. డీహైడ్రేషన్ సంకేతాలు, నివారణ సలహాలను ఆయన పంచుకున్నారు.
డీహైడ్రేషన్ గుర్తించే సంకేతాలు
1. చర్మ సమస్యలు:
శరీరానికి తగినంత నీరు అందనప్పుడు చర్మం బిగుతుగా, గరుకుగా అనిపిస్తుంది. పొడి బారిపోయి పొరలు పొరలుగా కనిపిస్తుంది. డీహేడ్రేట్ అయితే చర్మం స్థితిస్థాపకతను కోల్పోయి గీతలు, ముడతలు మరింత స్పష్టంగా కనపడతాయి.
2. పగిలిన పెదవులు:
డీహైడ్రేషన్ సమస్యకు మొదటి సంకేతం పెదవులు పగలడం. పెదవులు పొడిగా, బిగుతుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. ఎర్రగా, చికాకుగా కనిపిస్తాయి.
3. డల్ స్కిన్:
డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి ముఖం కాంతిని కోల్పోతుంది. మెరిసే చర్మం పేలవంగా మారుతుంది.
4.సున్నితత్వం పెరుగుతుంది:
నిర్జలీకరణ చర్మం చికాకులకు దారితీస్తుంది. అవసరమైన నీరు అందనప్పుడు చర్మం సున్నితంగా మారి దురద, ఎరుపు వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది.
5. గాయం మానదు:
చర్మంపై గాయాలు త్వరగా మానడం లేదంటే డీహైడ్రేషన్ సమస్య వచ్చిందని అర్థం. రోగనిరోధక వ్యవస్థ బలహాన పడి చర్మంపై కోతలు, గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
నిర్జలీకరణ సమస్యను నివారించాలంటే?
- రోజంతా నీరు తాగుతుండటం వల్ల డీహెడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
- పుచ్చకాయ, దోసకాయ, నారింజ లాంటి పండ్లు, పాలకూర వంటి కూరగాయలు తినాలి.
- అవకాడో, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను తినాలి.
- పెదవులను తేమగా ఉంచుకోవడానికి షియా బటర్ లేదా కొబ్బరి నూనె వంటి హైడ్రేటింగ్ పదార్థాలను పెదవులకు రాసుకోవాలి.
- డీహైడ్రేషన్ కారణంగా వచ్చే చర్మ సమస్యల నయం చేయడానికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.
- UV రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ ఉపయోగించడం మర్చిపోవద్దు.
- కెఫైన్, ఆల్కాహాల్ రెండింటికీ దూరంగా ఉండటం వల్ల హైడ్రేటెడ్ గా ఉండచ్చు. ఇవి రెండూ మూత్రవిసర్జన ప్రభావాన్ని పెంచుతాయి.