Cancer Patients Exposed To Air Pollution : వాయు కాలుష్యం మనుషుల ప్రాణాలను భారీగా బలిగొంటోంది. 2021లో ప్రపంచంలో సంభవించిన మొత్తం మరణాల్లో 12 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవించాయని ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాదు వాయు కాలుష్యం కారణంగా క్యాన్సర్ రోగులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని, వారికి మరణ ప్రమాదం ఎక్కువగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరించారు.
2021లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 81 లక్షల మంది మరణించారు. ఇందులో భారతీయులే 21 లక్షల మంది ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇక వాయు కాలుష్యం కారణంగా చైనాలో 23 లక్షల మంది మరణించారు. అంటే 2021లో వాయుకాలుష్యంతో ముడిపడి ఉన్న మరణాలలో భారత్-చైనాలు 54 శాతం వాటా కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ఐదేళ్లలోపు 1,69,400 మంది చిన్నారుల మరణాలకు వాయుకాలుష్యం కారణమైందని యునిసెఫ్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ HEI వెల్లడించింది. నైజీరియాలో 1,14,100 మంది, పాకిస్థాన్‌లో 68,100 మంది, ఇథియోపియాలో 31,100 మంది, బంగ్లాదేశ్‌లో 19,100 మంది చిన్నారులు వాయి కాలుష్యం కారణంగా మరణించారు.
దక్షిణాసియాలోనే అధికం
దక్షిణాసియాలో మరణాలకు వాయుకాలుష్యం ప్రధాన కారకంగా ఉందని, అధిక రక్తపోటు, ఆహారం, పొగాకు వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయని HEI నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ 2,56,000, బంగ్లాదేశ్ 2,36,300, మయన్మార్ 1,01,600 మంది వాయు కాలుష్యం కారణంగా మరణించారని వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ఇండోనేషియా 2,21,600 మరణాలు, వియత్నాం 99,700, ఫిలిప్పీన్స్ 98,209 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో నైజీరియా 2,06,700, ఈజిప్ట్ 1,16,500ల వాయు కాలుష్యం వల్ల మరణాలు సంభవించాయి. వాయు కాలుష్యం వల్ల గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అపారమైన ప్రభావం చూపుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా వాయు కాలుష్యం బారిన పడుతున్నారని, మధ్య ఆదాయ దేశాలపై కూడా వాయు కాలుష్యం గణనీయమైన ప్రభావం చూపుతోందని HEI చీఫ్ పల్లవి పంత్ తెలిపారు.
క్యాన్సర్ రోగులకు మరింత ప్రమాదం
క్యాన్సర్ రోగులు వాయు కాలుష్యానికి గురైతే గుండె జబ్బులు కూడా సంక్రమించే అవకాశం ఉందని ఓ పరిశోధన తెలిపింది. క్యాన్సర్ రోగుల మరణాల ప్రమాదాన్ని వాయు కాలుష్యం గణనీయంగా పెంచుతోందని చైనాలోని హువాజోంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైంది. గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ సహా గుండె సంబంధ వ్యాధులపై వాయు కాలుష్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని ఆ పరిశోధన తెలిపింది. 2000 నుంచి 2023 వరకు అధ్యయనం చేసిన పరిశోధకులు, వాయు కాలుష్యానికి గురికావడం వల్ల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధికి గురైన వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని తెలిపారు. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అసమానతలను తీవ్రతరం చేస్తోందని హెచ్చరించారు.
తండ్రికి లివర్ డొనేట్ చేసేందుకు కూతురు రెడీ- కానీ కోర్టు పర్మిషన్ కోసమే వెయిటింగ్!
అసోంను ముంచెత్తిన వరదలు- 26మంది మృతి- 1.61లక్షల మందికి తీవ్ర ఇబ్బందులు