Can vitamin D Help Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) ఒక్కసారి వచ్చిందంటే చాలు.. కూర్చోవడం, లేవడం, నడవడం, పడుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఉదయం లేవగానే తీవ్రమైన కండరాల నొప్పులతో ఇబ్బంది పడతారు. అయితే ఒకప్పుడు ఈ సమస్య వయసు పెరిగిన వారిలో కనిపించేది.. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. కీళ్లవాతంతో బాధపడేవారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలా మందిలో.. విటమిన్ డి తీసుకోవడం వల్ల కీళ్లవాతం నుంచి ఉపశమనం పొందవచ్చా ? అనే డౌట్ వస్తుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ డి అంటే ఏంటి ? విటమిన్ డి శరీరంలో చాలా విధులను నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఎముకలను బలంగా ఉంచడంలో, మానసిక ఆరోగ్య పరిస్థితిని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందిచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి రక్తపోటును నియంత్రించడంతో పాటు కణాల పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ వ్యాధులను కూడా విటమిన్ డి రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
విటమిన్ డి ఎలా అందుతుంది ? విటమిన్ డి లోపంతో బాధపడేవారు ఉదయాన్నే కొద్ది సేపు సూర్యరశ్మిలో ఉంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సహజ సిద్ధంగా శరీరంలో విటమిన్ డి స్థాయులు పెరుగుతాయని అంటున్నారు. అలాగే రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. వీరు ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవాలి. అలాగే విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్లు, సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల వాతాన్ని తగ్గించడానికి విటమిన్ డి సహాయపడుతుందా ?: సాధారణంగా మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎముకలు, కండరాల్లో నొప్పులు కలుగుతాయి. ఇది దీర్ఘ కాలం కొనసాగితే కీళ్లవాతం సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు విటమిన్ డి సప్లిమెంట్‌లను తీసుకోవడం వల్ల.. వారిలో కొంత వరకు కీళ్లవాతం నుంచి ఉపశమనం లభించిందని.. 2022లో జర్నల్ ఆఫ్ రుమటాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే, ఈ విటమిన్ డి సప్లిమెంట్‌లను తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.