Diabetics Can Consume Milk? : మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా దీని బారినపడుతున్నారు. ఇది వచ్చిందంటే.. ఆహారం, జీవనశైలి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని ఆహారాలకు, పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే షుగర్ ఉన్నవారిలో చాలా మందికి పాలు తాగొచ్చా? తాగకూడదా? అనే సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, డయాబెటిస్(Diabetes) వ్యాధిగ్రస్థులు పాలు తాగొచ్చా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతుంటారు నిపుణులు. ఈ క్రమంలోనే చాలా మంది పాలలో బోలెడు పోషకాలు ఉంటాయని తాగుతుంటారు. వాస్తవానికి.. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. కానీ, డయాబెటిస్ ఉన్నవారు పాలు తీసుకునే కొంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
డయాబెటిస్ ఉన్నవాళ్లు అరటికాయ తినొచ్చా? నిపుణుల మాటేంటి?
పరిశోధనల ప్రకారం.. పాలు డయాబెటిస్‌ను కలిగిస్తాయని గానీ.. సమస్యను మరింత ఎక్కువ చేయగలవని గానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవారు ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్థులలో మరికొన్ని సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, హై ఫ్యాట్ ఉన్న పాలకు బదులుగా.. 'లో ఫ్యాట్' ఉన్న మిల్క్ తీసుకోవడం బెటర్ అంటున్నారు.
2019లో "అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ కొవ్వు ఉన్న పాలు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాస్టిల్లా-లా మంచాకు చెందిన డాక్టర్ Celia Alvarez Bueno పాల్గొన్నారు.
ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రొటీన్ అధికంగా ఉండే పాలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర షుగర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయని సూచిస్తున్నారు. అలాగని పాలు అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు. ఎక్కువగా తాగడం వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు.. ఎల్లప్పుడూ తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్: ఎగ్స్ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!
షుగర్ బాధితులకు దివ్యౌషధం - ఈ "మసాలా కాకరకాయ" తింటే వెంటనే నార్మల్ అయిపోతుంది!