Is It Bad to Cook Roti Directly on Gas Flame : రొట్టెలు భారతీయ ఆహారంలో భాగం. దక్షిణాదిలో కొంత తక్కువగానే తీసుకున్నా.. ఉత్తరాదిలో మాత్రం రొటీలను ఎక్కువగా తింటారు. అయితే.. వీటిని చాలా మంది పెనంపై కాకుండా నేరుగా మంటపైనే కాల్చుతుంటారు. ఇది చాలా ప్రాంతాల్లో సాధారణమే అయినప్పటికీ ఇలా రొట్టెలను నేరుగా మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు పరిశోధనలో తేలింది.
రొట్టెలు లేదా ఏదైనా ఆహార పదార్థాన్ని నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు 2018లో Journal of Food Scienceలో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. "Formation of Polycyclic Aromatic Hydrocarbons (PAHs) in Food During Cooking" (రిపోర్ట్)అనే అంశంపై జరిగిన అధ్యయనంలో డాక్టర్లు J. S. Lee, J. H. Kim, Y. J. Lee పాల్గొన్నారు. అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCA), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (PAH)(రిపోర్ట్) కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు మాంసాన్ని కూడా నేరుగా మంటపై ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
ఎక్కువ కాలిపోకుండా చూడాలి
రొట్టెలు కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని చెబుతున్నారు. మంటను తగ్గించి.. రొట్టెలను తరచూ తిప్పడం వల్ల బాగా కాలిపోకుండా చూడవచ్చని.. ఒకవేళ మాడితే తినేముందు నల్లగా మారిన ప్రాంతాలను తొలగించాలని సూచిస్తున్నారు.
తక్కువగా తినండి..
ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రొట్టెలు నచ్చితే.. వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
పెనంపై కాల్చాలి..
రొట్టెలను నేరుగా మంటపై కాల్చకుండా పెనంపై వేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెనం అధిక ఉష్ణోగ్రతను గ్రహించి.. తక్కువ వేడిపై రొట్టేలను కాల్చేలా సాయం చేస్తుందని తెలిపారు. ఫలితంగా PAHలు, అక్రిలమైడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందని చెప్పారు.
మీ డైట్లో ఈ ఆహారాన్ని చేర్చుకోవాలి..
మీరు రొట్టెలు ఎక్కువగా తీసుకుంటుంటే వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవాలని చెప్పారు. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ రాకుండా సహాయ పడుతుందని వివరించారు. అందుకే క్యాన్సర్ రాకుండా తప్పించుకునేందుకు ఈ పద్ధతులను అనుసరించాలని వైద్యులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.