Symptoms Of Breast Cancer : నేటి కాలంలో చాలా మందిని వేధిస్తోన్న సమస్య.. రొమ్ము క్యాన్సర్. ఇది వరకు ఎవరికో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది. కానీ, ఇప్పుడు అలాకాదు.. వయసుతో సంబంధం లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. తాజాగా నటి హీనాఖాన్ తాను రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డానని పెట్టిన పోస్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఈ క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం వద్దని నిపుణులు అంటున్నారు. అందుకే.. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు రొమ్ముల్లో వచ్చే మార్పులను గమనించుకోవాల్సిందే అని.. స్వీయ పరీక్షలు చేసుకోవాల్సిందే అని సూచిస్తున్నారు. అలాగనీ చిన్న మార్పు వచ్చినా క్యాన్సర్ అని భయపడక్కర్లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రొమ్ము క్యాన్సర్(Breast Cancer) లక్షణాలు ఏంటి? ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి? స్వీయ పరీక్షలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు :
- రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి.
- రొమ్ములో వాపు లేదా ఉబ్బు
- చనుమొనల నుంచి ఏవైనా లిక్విడ్స్ రావడం
- చనుమొన, రొమ్ము చర్మం ఎరుపెక్కడం
- చనుమొన కాస్త లోపలికి వెళ్లినట్లు అవ్వడం
- భుజం, చేయి, చంకల్లో వాపు
రొమ్ముక్యాన్సర్ గడ్డ ఎలా ఉంటుంది?
- అన్ని క్యాన్సర్లు ఒకేలాగా ఉండవంటున్నారు నిపుణులు. కానీ, పైన చెప్పిన లక్షణాల్లో కొన్ని అయినా ఉండొచ్చని చెబుతున్నారు. అదెలా ఉంటుందంటే..
- గడ్డకు నొప్పి ఉండదట
- అలాగే గడ్డ గుండ్రంగా ఉండొచ్చు లేదంటే సరైన ఆకారం లేకుండా ఉండొచ్చు.
- టైమ్‌తో పాటూ గడ్డ పరిమాణం పెరుగుతూ ఉంటుంది.
- అయితే, కొన్ని రకాల క్యాన్సర్లలో గడ్డకు నొప్పి కూడా ఉండొచ్చనే విషయాన్ని మీరు గమనించాలి.
ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ :
- పురుషులతో పోలిస్తే మహిళల్లో ప్రమాదం ఎక్కువ
- వంశపార్యంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం
- పొగత్రాగడం వల్ల ప్రమాదం పెరుగుతుంది
- ఆల్కహాల్
- స్థూలకాయం
- వయసు వంటి విషయాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని ప్రభావితం చేయొచ్చు.
2017లో 'అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో.. స్థూలకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 40% పెంచుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టెన్ జాన్సన్ పాల్గొన్నారు. స్థూలకాయం ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : అధిక బరువున్న మహిళలకు క్యాన్సర్ ముప్పు - వెంటనే ఇలా చేయాల్సిందే!
స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలంటే?
- రొమ్ము క్యాన్సర్ గురించి స్వీయ పరీక్ష చేసుకునే ముందు మీ శరీరం మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. అంటే.. రొమ్ము పరిమాణం, ఆకారం, రంగు.. ఇలాంటివన్నీ తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు.
- ఈ స్వీయ పరీక్ష కోసం నెలలో ఒకరోజు కేటాయించండి. అయితే, పీరియడ్స్ టైమ్‌లో రొమ్ముల పరిమాణంలో కాస్త మార్పు ఉండొచ్చు. కాబట్టి, నెలసరి అయిపోయాక కొన్ని రోజుల తర్వాత ఒక రోజును ఎంచుకుంటే మంచిదంటున్నారు. ఒకవేళ మీకు పీరియడ్స్ రాకపోతే నెలలో ఏదో ఒక తేదీని స్వీయ పరీక్ష కోసం ఎంచుకోండని చెబుతున్నారు.
- మీరు స్వీయ పరీక్ష కోసం సిద్ధమైనప్పుడు అద్దం ముందు నిల్చొని మీ రొమ్ముల ఆకారం, పరిమాణం, రంగు గమనించుకోవాలి. ఆపై చేతులు పైకెత్తి మరోసారి చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత సోఫా లేదా బెడ్ మీద పడుకుని చేతులతో రొమ్ములను తాకండి. ఏవైనా గడ్డల్లాంటివి, లేదంటే ఏమైనా మార్పులున్నాయా గమనించండి. చనుమొన నుంచి చంకల వరకు రౌండ్ షేప్‌లో చేతి తిప్పుతూ చూడండి. రెండు వైపులా ఇదే విధంగా చెక్ చేసుకోండి.
- ఆపై చనుమొనను కాస్త ప్రెస్ చేసి చూడండి. అప్పుడు దాని నుంచి ఏవైనా స్రావాలు విడుదల అవుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలంటున్నారు.
- అదేవిధంగా.. మరోసారి స్నానం చేసేటప్పుడు కూడా రెండు రొమ్ములను చేత్తో తాకుతూ ఓసారి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎక్కడైనా మీకు కాస్త భిన్నంగా అనిపిస్తే ఒక డైరీలో నోట్ చేసుకోవాలి. ఆపై కొన్ని రోజుల తర్వాత అదే ప్లేస్‌లో మళ్లీ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏదైనా చిన్న తేడా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బొంగురు గొంతును లైట్ తీసుకుంటున్నారా? - ఏకంగా క్యాన్సర్ కావొచ్చట!