Body Flexibility Yoga Asanas : నేటి డిజిటల్ యుగంలో గంటల తరబడి కూర్చున్న చోట నుంచి కదలకుండా ఉంటున్నారు. దీనివల్ల చాలా మందిలో వెన్నెముక, మెడ, చేతులు నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని రకాల యోగాసనాలను వేయడం ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి.. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.అధో ముఖ స్వనాసనం : ఈ యోగాసనాన్ని 'డాగ్ పోజ్' అని కూడా అంటారు. ఇది తలకు రక్తప్రసరణను సాఫీగా వెళ్లేలా చేస్తుంది. అలాగే వీపు, భుజాలలో దృఢత్వాన్ని పెంచుతుందని నిపుణులంటున్నారు. ఇంకా కాళ్లు, చేతులు బలంగా ఉండేలా చేస్తుంది.
ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం
- ఈ అధో ముఖ స్వనాసనం వేయడానికి ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి.
- ఇప్పుడు రెండు అరచేతులను, పాదాల వేళ్లను భూమికి గట్టిగా నొక్కి పట్టాలి.
- బాడీ మెుత్తం వెయిట్‌ను అరచేతులు, పాదాలవేళ్ల మీద మోపి నిదానంగా శరీరంలో ఒక్కో భాగాన్ని పైకి లేపుతూ V ఆకారంలోకి శరీరాన్ని తీసుకురావాలి.
- ఈ ఆసనం చేస్తున్నప్పుడు చేతులు భుజాలు వెడల్పుగా ఉండాలి.
- ఈ భంగిమలో ఉన్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి.
- 30సెకన్ల పాటు ఈ భంగిమలో ఉన్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి శరీరాన్ని మెల్లగా తీసుకురావాలి.
2.త్రికోణాసనం : త్రికోణాసనాన్ని 'ట్రయాంగిల్ పోజ్' అని కూడా పిలుస్తారు. రోజూ ఈ ఆసనాన్ని వేయడం వల్ల వెన్ను కండరాలు సాగి నొప్పులు తగ్గుతాయట. అలాగే ఈ ఆసనంతో కాళ్లు, తుంటి, వెన్ను, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం..
- త్రికోణాసనాన్ని వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి.
- రెండు చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి.
- ఇప్పుడు నడుమును పక్కకు వంచి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి.
- అలాగే కుడి చేతిని పైకి తిన్నగా చాచాలి.
- ఇప్పుడు శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి.
- అలాగే శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
- తర్వాత ఇప్పుడు నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి.
- అలాగే ఎడమ చేయిని పైకి తిన్నగా చాచాలి.
- శ్వాసను మెల్లిగా వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి.
- మళ్లీ శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.
3. మార్జాలాసనం : వెన్నెముక బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మారడానికి, రక్తప్రసరణ మెరుగవ్వడానికి మార్జాలాసనం సహాయపడుతుంది. అలాగే ఈ ఆసనం వేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఈ భంగిమ పిల్లిని పోలి ఉండటంతో దీనిని 'మార్జాలాసనం' అని పిలుస్తారు.
ఈ ఆసనం ఇలా వేయాలి..
- మార్జాలాసనం వేయడానికి మొదట వజ్రాసనంలో కూర్చోవాలి.
- ఆ తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ అరచేతులు నేలకు ఆనించాలి.
- ఈ భంగిమలో అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటి భాగానికి సమాంతంగా ఉండేలా చూసుకోవాలి.
- ఇప్పుడు మెల్లిగా శ్వాస వదులుతూ నడుము భాగాన్ని వీలైనంతగా పైకి తీసుకురావాలి.
- ఆ తర్వాత తలను మెల్లిగా కిందకు దించాలి. ఇలాగే కొంతసేపు ఉండాలి.
- ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ తిరిగి నడుమును కిందకు వంచాలి.
4. ఉత్తనాసనం : ఉత్తనాసనం వేయడం వల్ల వెన్నెముక సాగుతుంది. దీనివల్ల వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా మారి, నొప్పి తగ్గుతుందని నిపుణులంటున్నారు. అలాగే ఈ ఆసనం వేయడం ద్వారా భుజాలు, తొడల కండరాలు బలంగా మారుతాయని చెబున్నారు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- ఉత్తనాసనం వేయడానికి ముందుగా నిటారుగా నిల్చుని చేతులను పైకి లేపండి.
- అ తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ముందుకు వంగతూ చేతులను పాదాలు లేదా నేలను తాకేలా ట్రై చేయండి.
- ఇలా ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. నిటారుగా ఉండాలని గుర్తుంచుకోండి.
- ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకుంటూ వదలండి.
- మోకాళ్లు, వెన్నెముక నొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.
జుట్టు రాలుతోందా? - రండి యోగా చేద్దాం!
ఆఫీస్‌లో యోగా - ఒక్కసారి ఈ ఆసనాలు ట్రై చేశారంటే, ఎంతో రిలాక్స్‌గా ఉంటారు!