Blood Pressure And Diabetes Patients : మారుతున్న జీవన శైలి ప్రజల్లో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను పెంచుతోంది. 2000-2001 మధ్య ఇటువంటి సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య 50 శాతం పెరిగిందని ది లాన్సెట్ జర్నల్ తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 15-49 సంవత్సరాల వయసు గల వ్యక్తులు అధిక బీఎంఐ, బ్లడ్ షుగర్‌కు ఎక్కువగా గురవుతున్నారని, ఈ రెండింటి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. వీరికి అధిక రక్తపోటు, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా హాని కలిగిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ఈ కారణాల వల్ల అకాల మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించింది.
జీవనశైలిలో మార్పుల వల్లే!
జీవనశైలిలో జరుగుతున్న మార్పులు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయని, యువతలో ఈ సమస్య అధికంగా ఉందని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME), అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్ మైఖేల్ బ్రౌర్ వివరించారు. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల యువతలో త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణమవుతోందని బ్రౌర్ చెప్పారు. IHME గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) కూడా ఇదే రకమైన అధ్యయన ఫలితాలను వెల్లడించింది. రానున్న భవిష్యత్తులో ఇది మరింత తీవ్ర సమస్యయ్యే అవకాశం ఉందని తెలిపింది.
క్షీణిస్తున్న వ్యాధి భారం
1990 నుంచి 2021 వరకు 204 దేశాల్లో వ్యాధులపై పరిశోధకులు సమగ్ర అధ్యయనం చేశారు. వ్యాధి భారాన్ని జనాభా, మరణాలు, వైకల్యం, ఆస్పత్రి ఖర్చుల వంటి విభిన్న సూచికల ద్వారా పరిశీలించారు. ధూమపానం, తక్కువ బరువుతో జననం, వాయు కాలుష్యం వల్ల 2021లో వ్యాధులు పెరిగాయని అధ్యయనం తెలిపింది. తల్లి, పిల్లల ఆరోగ్యం, అసురక్షిత నీరు, పారిశుధ్యం, చేతులు కడుక్కోకపోవడం వంటి ప్రమాద కారకాల వల్ల వ్యాధి భారం క్షీణించిందని వెల్లడించింది.
పెరుగుతున్న ఆయుర్దాయం
2022-2050 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆయుర్దాయం పురుషుల్లో దాదాపు ఐదు సంవత్సరాలు, మహిళల్లో నాలుగు సంవత్సరాలకుపైగా పెరుగుతుందని గ్లోబల్ అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో ఇప్పుడు ఆయుష్షు పెరుగుతోందని వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులు, కొవిడ్-19, అంటువ్యాధులు, ప్రసూతి, నవజాత, పోషకాహార వ్యాధుల నుంచి తట్టుకోవడం వల్ల పెరిగిన రోగ నిరోధకత వల్ల ఆయుర్దాయం పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది. ప్రజారోగ్య చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయుర్దాయం పెరుగుతోందని వెల్లడించింది.