Health Benefits of Black Foods : బ్లాక్ ఫుడ్స్ పేరు వినగానే చాలా మంది ఇవి నలుపు రంగులో ఉంటాయంటూ మొహం చిట్లించుకుంటారు. అయితే నిజానికి, ఆంథోసియనిన్ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ పిగ్మెంట్లు నలుపు, నీలం, పర్పుల్ రంగు పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయటున్నారు నిపుణులు. ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి అనారోగ్యంతోనైనా సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నల్ల బియ్యం : ఈ బియ్యం మనం రోజు తీసుకునే బియ్యంలా కాకుండా నల్లగా ఉంటాయి. ఈ ధాన్యంలో ఉండే ల్యూటిన్, జియాంథిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయంటున్నారు. ఈ రైస్‌తో బిరియానీ, పులావ్, పుట్టు, దోసె, ఇడ్లీ, ఖీర్ లాంటి వంటలను సైతం తయారుచేసుకోవచ్చు. సలాడ్‌లో భాగంగానూ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నల్ల పప్పు : మినుముల్నే నల్ల పప్పుగా వ్యవహరిస్తుంటారు. దాల్ మఖానీ, రోటీ, మినప సున్నుండలు లాంటి వంటకాలతో పాటు గ్రేవీల్లో కూడా ఈ పప్పును వాడుతుంటాం. ఈ పప్పు రుచితో పాటుగా, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇందులో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందంటున్నారు.
నల్ల నువ్వులు: నల్ల నువ్వుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునే వారు నల్ల నువ్వులు తింటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. నల్ల నువ్వుల్లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో పాటుగా వాపులు తగ్గించడానికి నల్ల నువ్వులు ఉత్తమ ఔషధంగా ఉపయోగపడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
నల్ల ద్రాక్ష: మలబద్ధకం, రక్తపోటు, జుట్టు నెరిసిపోవడం లాంటి సమస్యలకు నల్ల ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, లివోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నల్ల వెల్లుల్లి : తెల్ల వెల్లుల్లి అంటే మనందరికీ తెలుసు. కానీ, నల్ల వెల్లుల్లి కూడా ఉంటుంది. నూడుల్స్, సూప్స్, వేపుళ్లు, మొదలైన వాటిలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సుగుణాలు యాంటీ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరికొన్ని
నల్ల పుట్టగొడుగులు కాలేయం- పొట్ట ఆరోగ్యానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తికి మంచివని చెబుతున్నారు నిపుణులు. అలాగే నల్ల మిరియాలలో కొవ్వును, చక్కెర స్థాయుల్ని అదుపు చేసే గుణాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు. ఇవి క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇవి శరీరానికి అందిస్తాయంటున్నారు. బ్లాక్ బెర్రీస్‌లో విటమిన్ 'సి'తో పాటుగా 'కె' విటమిన్ అధికంగా ఉంటాయి. నోటి ఆరోగ్యానికి, మెదడు చురుకుదనానికి బ్లాక్ బెర్రీస్ ఎంతగానో దోహదం చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు - Alzheimer Disease Symptoms