Best Habits for Healthy Gums : ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు నోటి(Mouth) ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. దాంతో చాలా మందిలో చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి, బ్రష్ చేసుకున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే గుండె సమస్యలూ వస్తాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా ఉండాలంటే మీ చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు. అందుకోసం కొన్ని టిప్స్‌ను కూడా సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెగ్యులర్ టూత్ బ్రషింగ్ : చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. డైలీ టూ టైమ్స్ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించి బ్రష్ చేయడం. ఇది ఆరోగ్యకరమైన చిగుళ్లకు మూలస్తంభంగా పనిచేస్తుంది. అలాగే బ్యాక్టీరియా చేరడం, చిగుళ్ల వ్యాధులు, ఇతర నోటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్‌ని యూజ్ చేయడమే కాకుండా, వృత్తాకార కదలికలలో సున్నితంగా బ్రష్ చేయాలి.
మౌత్ వాష్ యూజ్ చేయడం : చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేయాల్సిన మరో పని మౌత్ వాష్. మీ రోజువారీ నోటి సంరక్షణ నియమావళిలో ఫ్లోరైడ్ లేదా యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌ను ఉపయోగించడం వల్ల చిగుళ్ల ఆరోగ్యంగా మారుతాయంటున్నారు నిపుణులు. ఇది మీ నోటిలో నివసించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసి చిగుళ్లకు అదనపు రక్షణను అందిస్తుంది. అలాగే చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా తాజా శ్వాసను ప్రోత్సహిస్తుంది.
ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే మీ దంతాలు దెబ్బతినడం ఖాయం!
సరైన ఆహారం తీసుకోవడం : చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడంలో మనం తీసుకునే ఆహారం కూడా కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిగుళ్ల కణజాలానికి అవసరమైన కీలక పోషకాలు అందుతాయి. అలాగే చక్కెర, ఆమ్ల ఆహారాలు, పానీయాల తీసుకోవడం పరిమితం చేయడం వల్ల దంత క్షయం, చిగుళ్ల వాపు తగ్గుతుంది.
ధూమపానం మానేయడం : మీ చిగుళ్లు హెల్తీగా ఉండాలంటే ధూమపానానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగతాగడం, పాన్, గుట్కా వంటి ఇతర పొగాకు ఉత్పత్తులు చిగుళ్ల వ్యాధికి దారి తీస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పొగాకు రక్త ప్రవాహాన్ని కూడా పరిమితం చేస్తుంది. కాబట్టి మీకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వెంటనే చిగుళ్ల ఆరోగ్యం కోసం దానిని మానేయ్యాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఒత్తిడిని తగ్గించడం : ఇది కూడా చిగుళ్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒత్తిడి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో.. మీ శరీరం ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం కష్టమవుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటితోపాటుగా రోజూ తగినంత వాటర్ తాగడం, రెగ్యులర్ డెంటల్ చెకప్స్ వంటివి కూడా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.