Best Ways to Stimulate the Brain Health : మన బాడీలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అది హెల్తీగా ఉంటేనే.. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే భావోద్వేగాల్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఆలోచించగలం. కానీ, ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా మతిమరపు, ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బ్రెయిన్ ప్రశాంతంగా ఉండేదుకు.. తద్వారా పవర్ పెరిగేందుకు పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెగ్యులర్ వ్యాయామం: డైలీ వ్యాయామం అనేది శరీరానికి మాత్రమే కాదు.. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.. సాధారణ శారీరక శ్రమ అనేది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుందని కనుగొన్నారు. అలాగే మానసిక రుగ్మతలను నిరోధించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి.. మీ రోజువారి జీవితంలో కాస్త శారీరక శ్రమ ఉండేలా చురుకైన నడక, ఈత లేదా యోగా లాంటివి చేర్చుకున్నారంటే మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన పోషకాహారం మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే మనం సరైన ఫుడ్ తీసుకోకపోతే ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే సైటోకైన్స్ ఎక్కువగా విడుదలై మెదడును దెబ్బతీస్తాయట. ఇది ఎక్కువకాలం కొనసాగితే మతిమరుపు, ఆల్జీమర్స్ లాంటి సమస్యలు రావొచ్చు. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారం మెదడు రుగ్మతల నుంచి కాపాడుతుందని తేలింది. వీటితోపాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం.
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్ ఫాగ్" ఉన్నట్టే!
ఒత్తిడి తగ్గించుకోవడం: మనిషి భావోద్వేగాలు, భయాలు మెదడు కణాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా మెదడు పనితీరు నెమ్మదించడం, వాస్తవాలను అర్థం చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, స్పందించడంలో వెనుకబడటం వంటివి జరుగుతాయి. కాబట్టి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లాంటివి చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చు. అలాగే రోజూ తగినంత నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
మెదడుకు శ్రమ : మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి మానసిక శ్రమ చాలా అవసరం. అందుకోసం తరచుగా పదవినోదం, సుడోకు, చెస్, పజిల్స్ లాంటివి ఆడుతూ ఉండాలి. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవడం మీరు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా మెదడు ఆరోగ్యానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందుకోసం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం: సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొనడం ద్వారా కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో మనసును చురుకుగా ఉంచడంలో, రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడంలో సోషల్ ఇంటరాక్షన్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. అందుకోసం కమ్యూనిటీ కార్యకలాపాలలో పాల్గొనడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డుతో బోలెడు లాభాలు.. రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?