Best Tips to Convenient in Periods : మహిళలు నెలనెలా పీరియడ్స్ టైమ్‌లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇది సహజమే! అయినప్పటికీ కొందరిలో అవి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కడుపునొప్పి, నడుంనొప్పి, రక్తస్రావం, చికాకు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని టిప్స్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వేడి నీళ్ల బాటిల్‌తో : పొత్తి కడపులో నొప్పి వచ్చినప్పుడు.. హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్లు నింపిన బాటిల్‌ను తీసుకోండి. దాని చుట్టూ ఒక కాటన్ క్లాత్‌ను చుట్టుకోవాలి. ఆ తర్వాత బాటిల్‌తో పెయిన్ ఉన్న చోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ తర్వాత కాస్త గోరువెచ్చని వాటర్‌తో స్నానం చేస్తే.. మనసుకు ప్రశాంతంగా అనిపించి, హాయిగా నిద్రపడుతుందట.
మసాజ్ : నడుము నొప్పి వేధిస్తే.. పెప్పర్మెంట్, లావెండర్, రోజ్మేరీ.. ఇలా ఏదో ఒక ఆయిల్‌తో కాస్త మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల వేగంగా ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పీరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదా? ఎవరినీ ముట్టకూడదా?
ఈ ఫుడ్ తీసుకోవాలి : పీరియడ్స్ టైమ్‌లో మీరు సౌకర్యంగా ఉండాలంటే.. తినే ఆహారంలో కొన్ని ఛేంజెస్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉంటే పాలకూర, పాలు, పాల పదార్థాలు.. వంటివి మీ డైట్లో చేర్చుకోవాలి. అలాగే ఈవెనింగ్ స్నాక్స్ టైమ్‌లో.. ఆయిల్ ఫుడ్స్ కాకుండా నట్స్, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా జీవక్రియల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తినడం ద్వారా బాడీలో ఎండార్ఫిన్లు విడుదలై మనసును ఉత్తేజపరుస్తాయంటున్నారు.
ఇకపోతే నెలసరి సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కు కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ టైమ్‌లో అవి తీసుకోవడం వల్ల ఉబ్బరం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అలాగే 'సారా ట్యోగుడ్' అనే వైద్యురాలు చేపట్టిన అధ్యయనంలో పీరియడ్స్ టైమ్‌లో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదని తేలిందట.
వాటర్ తాగడం : నెలసరి సమయంలో వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. వీలైతే గోరువెచ్చని వాటర్ తాగడం ఇంకా మంచిదని, పెయిన్ నుంచి త్వరిత ఉపశమనం పొందడానికి సహాయపడుతుందంటున్నారు. అలాగే.. వాటర్ లెవల్స్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా దోస.. వంటివి ఎక్కువగా తీసుకోవడం బెటర్ అంటున్నారు.
చిన్న చిన్న వ్యాయామాలు : పీరియడ్స్ టైమ్‌లో చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం.. వంటివి చేయడం చాలా మంచిది. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు ఈ టైమ్‌లో ఎదురయ్యే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్.. తదితర సమస్యల నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుందని పుణెలోని మదర్ హుడ్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తున్న డా.సుశ్రుత తెలిపారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే.. మీరు ఎంచుకునే ఎక్సర్సైజ్లు పొత్తి కడుపు, నడుముపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం మంచిదంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే పిల్లలు పుట్టరా? సెక్స్‌కు వయోపరిమితి ఉంటుందా?