Best Tips To Make Children To Drink Milk : బలవర్థకమైన ఆహారాలలో పాలు ఒకటని చెప్పుకోవచ్చు. దీనిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లలు ఎదిగే క్రమంలో తప్పనిసరిగా పాలు తాగిస్తుంటారు. కానీ.. చాలా మంది పిల్లలు పాలు అంతగా రుచించక తాగడానికి ఇష్టం చూపించరు. మీ పిల్లలు కూడా ఇలాగే మారా చేస్తుంటే.. ఈ సింపుల్స్ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా తయారు చేసి అందించండి : మీ పిల్లలు ఇష్టంగా పాలు తాగాలంటే.. రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్‌షేక్స్‌గా తయారు చేసి అందించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా వాటి రుచి మరింత పెరిగి ఇష్టంగా తాగుతారంటున్నారు. అయితే, వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు పాల పరిమాణం ఎక్కువగా, పండ్ల పరిమాణం కాస్త తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చంటున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. వాటిని తయారు చేసేటప్పుడు చక్కెర తక్కువ మొత్తంలో ఉపయోగించేలా చూసుకోండి. ఎందుకంటే.. అధిక చక్కెర వినియోగం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వెన్నతో పాటు ఇవ్వండి : కొంతమంది తల్లులు పిల్లలకు పాలను వెన్నతో కలిపి ఇవ్వరు. అందులోని కొవ్వులు బాడీలోకి చేరి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని భావిస్తారు. అయితే.. వెన్న తొలగించిన పాలు రుచికరంగా ఉండవు. అందుకే పిల్లలు తాగడానికి ఇష్టపడరు. కాబట్టి, తొలుత వారికి పాలు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు వెన్నతో ఇస్తూ.. క్రమంగా వెన్న శాతాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఫలితంగా పిల్లలకు పాలు రుచించడంతోపాటు కొన్ని రోజుల తర్వాత వెన్న లేని పాలను తాగడానికీ అలవాటుపడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
పాలల్లో చక్కెర వేసుకొని తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఇవి కలిపిచ్చినా ఇష్టంగా తాగేస్తారు : పిల్లలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్‌ఫ్లేక్స్, చాకోస్.. వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, వాటిని నేరుగా అందించకుండా పాలలో కలిపి ఇస్తే వాటి రుచి పెరుగుతుంది. ఫలితంగా పిల్లలు వాటిని తినడమే కాకుండా ఇష్టంగా పాలు కూడా తాగేస్తారంటున్నారు నిపుణులు. అలాగే ఓట్‌మీల్, పాస్తా.. వంటి పదార్థాల్లో నీళ్లకు బదులుగా పాలను ఎక్కువగా యూజ్ చేయడం కూడా మంచిదే అంటున్నారు.
ఇవేకాకుండా.. ప్రస్తుతం మార్కెట్లో పిల్లల పాలలో రుచి కోసం కలపడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని యూజ్ చేయవచ్చు. అలాగే.. పోషకాహార నిపుణుల సలహా తీసుకుని కూడా రుచి కోసం పాలలో కలిపే పదార్థాల్ని సెలెక్ట్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా పిల్లలకు అందించే పాలు రుచిగా మారడంతో పాటు పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి.. వంటి పోషకాలు పిల్లలకు సమృద్ధిగా అందుతాయని, వారు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయని సూచిస్తున్నారు. చూశారుగా.. పిల్లలకు బలవర్థకమైన పాలను రుచిగా ఎలా అందించాలో.. మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. వారి సంపూర్ణ ఎదుగుదలకు సహకరించండని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.