Home Remedies Get Rid Of Mosquitoes : దోమలను పారదోలేందుకు చాలా మంది రకరకాల మస్కిటో రిపెల్లెంట్లు, మస్కిటో కాయిల్స్ వంటివి యూజ్ చేస్తుంటారు. అయితే.. అవి దోమల్ని తరిమికొట్టడం సంగతి ఏమోగానీ.. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యానికే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. సహజసిద్ధంగా దోమల(Mosquitoes) బెడదను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేప నూనె, కర్పూరంతో దీపం : కొద్దిగా వేపనూనె తీసుకొని అందులో కర్పూరం బిల్లలు వేసుకొని కరిగించుకోవాలి. ఆపై ఆ నూనె ఒక ప్రమిదలోకి పోసుకొని వత్తిని వేసుకొని వెలిగించుకోవాలి. అలా వెలిగించడం వల్ల ఆ వత్తి నుంచి వచ్చే పొగను దోమలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాయంటున్నారు నిపుణులు.
వేప నూనె, కర్పూరం, బిర్యానీ ఆకులు : చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వేప నూనె తీసుకొని అందులో 5 నుంచి 6 కర్పూరం బిల్లలను వేసుకొని కరిగించుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని బిర్యానీ ఆకులకు పూసి, ఆకులను కాల్చడం ద్వారా వచ్చే ఆ పొగకు దోమలు పారిపోతాయంటున్నారు.
కర్పూరం, వేప ఆకుల పొగ : నిత్యం మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు.. కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే.. ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు నిపుణులు. ఒకవేళ వేప ఆకులు లేకపోతే.. కర్పూరంతో పొగ వేసినా సరిపోతుందంటున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ ఆర్థ్రోపాడ్ బోర్నోలోజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కర్పూరం దోమలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇండియాలోని పుణెకు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. కర్పూరం పొగ వేసినప్పుడు దాని నుంచి వచ్చే వాసన దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
దోమలకు కొందరే ఎందుకు ఇష్టం?.. వారినే ఎందుకు టార్గెట్ చేస్తాయి?
కొబ్బరినూనె, వెల్లుల్లి : ఈ చిట్కా కూడా దోమల నివారణకు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టుతీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆపై వాటిని స్టౌపై చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె పోసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకొని అవి నల్లగా మారే వరకు నూనె హీట్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని చల్లార్చి ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఆపై రాత్రి పడుకునే ముందు దాన్ని శరీరానికి రాసుకొని పడుకుంటే దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
అలాగే.. నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకొని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు!
నిమ్మకాయ, లవంగాలు : నిమ్మకాయ లవంగాలను ఉపయోగించి దోమల బాధ నుంచి మంచి రక్షణ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. నిమ్మకాయను రెండు ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలపై లవంగాలను కుచ్చి.. మంచానికి దగ్గరగా లేదా పడుకున్న చోటుకు దగ్గరగా పెట్టుకుంటే అక్కడ దోమలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!