Best Food For Kids Memory : పిల్లలు చదువులో బాగా రాణించి ప్రయోజకులుగా మారాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. అందుకోసం వారిని మంచి మంచి పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పిస్తారు. అయినప్పటికీ.. చాలా మంది పిల్లలు 'మమ్మీ ఎంత చదివినా కూడా గుర్తుండటం లేదు' అని సమాధానం చెబుతుంటారు. దీనివల్ల వారు కష్టపడి చదివినా కూడా పరీక్షల్లో తక్కువ మార్కులు సాధిస్తారు. ఇలా పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడానికి.. సమతుల ఆహారం తినకపోవడమే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చదివింది ఎక్కువ రోజులు గుర్తుండటానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి కొన్ని ఆహార పదార్థాలను పిల్లలకు ఎక్కువగా అందించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బెర్రీలు :
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిని తరచుగా అందించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్ :
ఓట్స్‌లో పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ అందించడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటంతోపాటు, దానికి శక్తి అందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో 'న్యూట్రీషియన్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఓట్స్ తినే పిల్లలు.. ఓట్స్ తక్కువ తినే వారి కంటే ఎక్కువ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ డేవిడ్ డోనల్డ్సన్' పాల్గొన్నారు.
పిల్లలు సరిగా తినక బక్కగా ఉన్నారా? - తిండి వైపు ఇలా మళ్లించండి - ఇవి తినిపించండి!
వేరుశనగ :
వేరుశనగలో బ్రెయిన్ చురుకుగా పనిచేయడానికి అవసరమయ్యే మెగ్నీషియం, విటమిన్ ఇ, జింక్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
బీన్స్ :
బీన్స్‌లో ప్రొటీన్, పిండిపదార్థాలు, విటమిన్‌లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు :
ఎగ్స్‌లో మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచే విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. అలాగే గుడ్డు సొనలో మెదడులో కణాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడే ముఖ్యమైన కోలిన్ పోషకం ఉంటుంది. ఇవి పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రోజూ పిల్లలకు గుడ్డును అందించాలని సూచిస్తున్నారు.
చేపలు :
సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడు కణాలను రక్షించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడతాయి. తరచు పిల్లలకు ఈ ఆహారాన్ని అందించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా పండ్లు, కూరగాయలు :
ఈ పదార్థాలతో పాటు పిల్లలకు సీజనల్ ఫ్రూట్స్‌ను తప్పకుండా తినిపించాలి. ఇంకా రోజూ తాజా పండ్లు, కూరగాయలను తినిపించడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్‌లను తరచుగా పెట్టాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు హైట్ పెరగాలంటే ఎనర్జీ డ్రింక్స్ తాగించడం కాదు - ఇలా చేయండి వెంటనే గ్రోత్ మొదలైద్ది!
మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపించిందా? - పేరెంట్స్‌గా మీరు ఈ విషయాలు నేర్పించాల్సిందే!