Benefits of Drinking Ragi Malt : అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో రాగులూ ఒకటి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయి. రోజూ ఏదో ఒక రూపంలో రాగులను డైట్లో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డైటీషియన్ 'డాక్టర్ శ్రీలత' చెబుతున్నారు.
రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. రాగి జావలో అమైలేజ్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. దీనిని మజ్జిగ లేక పాలతో తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే మలబద్ధకం సమస్య తగ్గుతుందని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు.
బరువు తగ్గొచ్చు!
రోజూ రాగి జావ తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించే వారు డైలీ తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.
"రాగులలో పీచు పదార్థం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా తీసుకుంటే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రాగి జావ తాగవచ్చు. కానీ, కిడ్నీఫెయిల్ అయిన వారు మాత్రం దీనిని తాగకూడదు. ఎందుకంటే ఇందులో పొటాషియం శాతం అధికంగా ఉంటుంది." - డాక్టర్ శ్రీలత
పిల్లలకు సూపర్ ఫుడ్ :
మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ రాగి జావ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రాగి జావతో పెసలు, శనగలు వంటి మొలకెత్తిన పప్పుధాన్యాలను కలిపి చిన్నారులకు బలవర్ధకమైన ఆహారంగా ఇవ్వవచ్చు.
ఎముకలు, దంతాలు దృఢంగా :
రాగులలో ఉండే ఫైబర్ కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. దీంతో అంత త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు. ఇందులోని క్యాల్షియం ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది. ఇంకా కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
ఎదిగే పిల్లలకు రాగి జావ అందించడం వారికి ఎంతో మేలు చేస్తుంది. దీనిద్వారా వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. రాగుల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఈ ఆహారం రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. ఫలితంగా గ్లూకోజ్ లెవెల్స్ అంత త్వరగా ఎక్కువ స్థాయిలో పెరగవు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్ శ్రీలత పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి: