Ayurvedic Home Remedy to Reduce High BP : నేటి ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి వివిధ కారణాల వల్ల ఎంతో మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు చాలా వరకు ఉప్పుని తీసుకోవడం తగ్గిస్తారు. అయినా కూడా హైబీపీ కంట్రోల్లో ఉండడం లేదని వాపోతుంటారు. బీపీ అదుపులో లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆయుర్వేద పద్ధతిలో ఇంట్లోనే ఒక పథ్యాహారం సిద్ధం చేసుకుని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు 'డాక్టర్ గాయత్రీ దేవి' చెబుతున్నారు. ఇంతకీ పథ్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- మినప్పప్పు-టేబుల్‌స్పూన్
- శనగపప్పు-టేబుల్‌స్పూన్
- జీలకర్ర-టేబుల్‌స్పూన్
- నూనె-కొద్దిగా
- ధనియాలు -50 గ్రాములు
- కరివేపాకు-100 గ్రాములు
- చింతపండు- నిమ్మకాయ సైజు
- ఇంగువ -కొద్దిగా
- పసుపు-చిటికెడు
పథ్యాహారం తయారీ విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టండి. తర్వాత ఆయిల్ వేసి వేడి చేయండి.
- నూనె వేడైన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇంగువ, పసుపు వేసి కలపండి.
- ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి.
- కరివేపాకు బాగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
- అంతే ఇలా చేసుకుంటే అధిక రక్తపోటు వారికి చక్కగా పనిచేసే పథ్యాహారం తయారైపోతుంది.
పథ్యాహారం తీసుకుంటే 'బీపీ మందులు' వేసుకోవాల్సిన అవసరం ఉండదా ?: అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రమంగా ఎక్కువ డోస్ ఉన్న మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే, అధిక డోస్ మందు అవసరం తగ్గడానికి ఈ పథ్యాహారం చక్కగా ఉపయోగపడుతుందని డాక్టర్ గాయత్రీ దేవి సూచిస్తున్నారు. అలా అని అధిక రక్తపోటు మందులు పూర్తిగా మానేయకూడదు. ఆ మందులు వేసుకుంటూనే.. ఈ ఔషధం రోజూ తీసుకోవడం వల్ల డోస్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుందని గాయత్రీ దేవి చెబుతున్నారు.
పథ్యాహారం ఎలా తీసుకోవాలి ? అన్నం తినే సమయంలో ప్లేట్లో ఒక స్పూన్ పొడి వేసుకోవాలి. తర్వాత పొడితో అన్నం కలుపుకుని మొదట తినాలి. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉప్పు వాడకం తగ్గించాలి. అందుకే ఈ పథ్యాహారంలో ఉప్పు వేసుకోకూడదు. ప్రతిరోజు ఈ పథ్యాహారం తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"బీపీ" చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నారా? - ఈ పొరపాట్లు చేస్తే మీ లెక్కలు తారుమారు!