Ayurvedic Home Remedy for Asthma in Winter : ఆస్తమా బాధితులకు చలికాలం కాస్త గడ్డుకాలం అనే చెప్పవచ్చు. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ కాలంలో చల్లని వాతావరణం, చలిగాలుల కారణంగా ఆస్తమా ఉద్ధృతం అవుతుంది. దీంతో ఊపిరి సరిగా అందకా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే సీజన్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారం, వ్యాయామాలతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఓ ఔషధాన్ని రెగ్యూలర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- అడ్డసరం ఆకుల చూర్ణం-50 గ్రాములు
- పసుపు-25 గ్రాములు
- తిప్పతీగ చూర్ణం-25 గ్రాములు
- వాకుడు కాయలు చూర్ణం-25 గ్రాములు
- మిరియాల పొడి-25 గ్రాములు
- గ్లాసు నీళ్లు
తయారీ విధానం :
- ముందుగా ఒక గిన్నెలోకి అడ్డసరం ఆకుల చూర్ణం, తిప్పతీగ చూర్ణం, పసుపు, వాకుడు కాయలు చూర్ణం, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టి.. గ్లాసు నీళ్లు పోయండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్పూన్ చూర్ణం వేసి బాగా కలపండి.
- ఒక 5 నిమిషాలు కషాయం మరిగించిన తర్వాత.. గ్లాసులోకి వడబోసుకోవాలి.
- అంతే చలికాలంలో ఆస్తమా సమస్యను తగ్గించేందుకు ఔషధం తయారైపోయింది.
- దీనిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
- ఈ చూర్ణం ఒక గ్లాసు జారులో స్టోర్ చేసుకుని రోజూ ఉపయోగించుకోవచ్చు.
ప్రయోజనాలు:
అడ్డసరం ఆకులు : దీనిని సంస్కృతంలో 'వాస' అంటారు. ఈ వాస అనేది ఏంటంటే.. దగ్గు, ఆస్తమా వంటి సమస్యలకు చక్కగా పని చేస్తుంది. ఈ మూలికని ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి.
తిప్పతీగ చూర్ణం : తిప్పతీగని 'అమృతాన్ని గుడూచి' అని కూడా పిలుస్తారు. తిప్పతీగ ఆస్తమాతో బాధపడే వారిలో ఉండే వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆస్తమాతో వచ్చే దగ్గు, ఆయాసం వంటి ఇబ్బందులను తగ్గించేలా సహాయం చేస్తుంది. ముందుగా తిప్పతీగ మొత్తాన్ని బాగా ఎండబెట్టుకోవాలి. ఆపై దానిని చూర్ణంలా చేసుకోవాలి.
పసుపు చూర్ణం : పసుపు ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
వాకుడు కాయలు : వాకుడు కాయలు ఆస్తమా తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని సంస్కృతంలో 'కంటకారి' అంటారు. వీటిని ఎండలో బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి.
మిరియాలు : దాదాపు మనందరి ఇళ్లలో మిరియాలు తప్పకుండా ఉంటాయి. ఇవి ఆస్తమా తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఆస్తమా బాధితులలో మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి.
ఔషధం ఎలా తీసుకోవాలి : చలికాలంలో ఆస్తమాతో బాధపడేవారు పై విధంగా ఔషధం సిద్ధం చేసుకుని ఎప్పటికప్పుడు కషాయం రెడీ చేసుకోవాలి. కషాయాన్ని 30-40 ml పరిమాణంలో ఉదయం, సాయంత్రం కలిపి రెగ్యూలర్‌గా తీసుకోవాలి. దీనివల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో చర్మ సమస్యలా? ఇది పెట్టుకుంటే అన్నీ మాయం! మీరు ట్రై చేయండి!
మెనోపాజ్‌లో వేడి ఆవిర్లు, నిద్రలేమితో ఇబ్బందులా? - ఈ డైట్ చాలా మేలు చేస్తుందట!