Avoid These Foods in Breakfast to Get Rid From Gastric: గ్యాస్ట్రిక్.. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొనే సమస్య. మారిన జీవనశైలి, నిద్రలేమి, ఒత్తిడి సహా ఇతర కారణాల వల్ల ఈ సమస్య అధికమవుతుంది. అయితే.. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే ఫుడ్స్ కూడా ఈ సమస్యకు కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కాలీఫ్లవర్, క్యాబేజీ : చాలా మంది మార్నింగ్ పరాటాను.. ముఖ్యంగా గోబీ పరాటాను ఇష్టంగా తింటుంటారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యను నివారించడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో గోబీ పరాటాను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. కాలీఫ్లవర్, క్యాబేజీలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే కడుపులో గ్యాస్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అందుకే ఉదయం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
యాపిల్స్ : ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రోజుకు ఒక యాపిల్ కచ్చితంగా తినాలని నిపుణులు కూడా సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌గా యాపిల్స్ తింటుంటారు. అయితే, ఉదయం పూట యాపిల్, పియర్స్ వంటి పండ్లు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ పండ్లలో ఫ్రక్టోజ్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందని.. ఇవి తినడం ద్వారా ఉబ్బరం, గ్యాస్‌కు కారణం అవుతాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమయంలో యాపిల్స్‌కు బదులుగా మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లను చేర్చడానికి కొన్ని బెర్రీలను తీసుకోవచ్చట.
అజీర్తి సమస్యలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- డాక్టర్ల సూచనలు ఇవే!
పచ్చి కీరా, ఉల్లిపాయలు : చాలా మందికి మార్నింగ్ టైం లో సలాడ్ తినే అలవాటు ఉంటుంది. అందులో కొద్దిమంది కీరా, ఉల్లిపాయల సలాడ్ తింటుంటారు. అయితే ఇలా తినే అలవాటు ఉంటే.. వెంటనే మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి కూరగాయల్లో.. ముఖ్యంగా దోసకాయ, ఉల్లిపాయలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది విచ్ఛిన్నం కావడానికి కొంత సమయం పడుతుంది. దీని కారణంగా పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
కార్న్‌ఫ్లేక్స్ : చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో కార్న్‌ఫ్లేక్స్ తింటుంటారు. కార్న్ ఫ్లేక్స్‌లో సెల్యూలోజ్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫైబర్. కొందరికి ఇది సులభంగా జీర్ణం కాదు. అందువల్ల మార్నింగ్ తినొద్దని సూచిస్తున్నారు. మీ డైట్‌లో కార్న్ ఫ్లేక్స్ బదులుగా.. క్వినోవా, ఓట్స్ వంటివి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
టీ, కాఫీలు వద్దు: ఇక చివరిది, అత్యంత ముఖ్యమైనది.. ఉదయం పూట టీ, కాఫీలకు దూరంగా ఉండాలట. చాలా మంది టీ, కాఫీ తాగకుండా.. రోజును స్టార్ట్ చేయలేరు. అయితే ఉదయం పూట టీ, కాఫీ తాగితే.. కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయట. ఈ పరిస్థితి గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది. అంతేకాదు, పాలతో చేసిన టీ, కాఫీ తాగితే.. జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. మీరు గ్యాస్ట్రిక్ కారణంగా బాధపడుతుంటే.. ఉదయం పూట టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?