Antibiotics Side Effects In Telugu : ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న జబ్బుకు యాంటీ బయాటిక్స్ వాడటం సర్వసాధారణమైపోయింది. ఏదైనా చిన్న జబ్బుల బారినపడినప్పుడు శరీరానికి పోరాడే సమయం ఇవ్వకుండా ఈ మాత్రలు వేసి తగ్గించేసుకుంటున్నారు. వాటి వల్ల జరిగే నష్టాలను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. యాంటీ బయాటిక్స్ అధికంగా వాడటం వల్ల మన బాడీకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా వీటి వాడకంలో ఏదైనా తేడాలొస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ యాంటీ బయాటిక్స్ ఎందుకు వాడుతారు? అవి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలపై వైద్యుల సూచనలు తెలుసుకుందాం.
"బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ కలిగినప్పుడు దానిని తగ్గించుకునేందుకు యాంటీబయాటిక్స్ ఇస్తుంటాం. బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ సాధారణంగా సైనసైటీస్, టాన్సిసైటిస్, మూత్రపిండాల్లో ఇన్ ఫెక్షన్లు, కాళ్లలో వాపు లాంటివి బాక్టీరియాల వల్ల కలిగే సాధారమైన ఇన్ఫెక్షన్స్. ఇవి సోకినప్పుడు సాధారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో శరీరానికి అంత సమయం ఇవ్వకుండానే యాంటీబయాటిక్స్ని వాడుతున్నారు. దాని వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగకుండా ఉంటుంది"
-- నిపుణులు
ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు
అయితే ఈ యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బాక్టీరియాలు కూడా వాటిని తట్టుకునేలా మార్పు చెందుతున్నాయి. దాని వల్ల తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయవు అని వైద్యులు చెబుతున్నారు. వీటి వాడకం ఎక్కువ అవ్వడం వల్ల శరీరంలో సూపర్ బగ్స్ ఏర్పడుతున్నట్లు ఇటీవలే కనగొన్నారు. దీనిని ఎటువంటి యాంటీబయాటిక్స్ నిరోధించలేవు. దీని వల్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
యాంటీ బయాటిక్స్ ఇచ్చేటప్పుడు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. చిన్న చిన్న జబ్బులకే వీటిని తీసుకోవటం వల్ల భవిష్యత్తులో పెద్ద జబ్బులు వస్తే ఇవి పనిచేయవు దాని వల్ల ప్రాణాలకే ప్రమాదం. కనుక తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అదే విధంగా శరీరానికి యాంటీబయాటిక్స్ ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మేరనే తీసుకోవాలి. ఒకవేళ తక్కువ లేదా ఎక్కవుగా తీసుకుంటే కిడ్నీ, లివర్లు దెబ్బతింటాయి. యాంటీబయాటిక్స్ ఉపయోగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకే వీటిని వాడాలని నిపుణులు చెబుతున్నారు.
బీ అలర్ట్ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్ వచ్చే అవకాశం!
బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!