Neem Leaves Benefits : మన దేశంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అందుకే వేపను 'సర్వరోగ నివారిణి' అని కూడా పిలుస్తారు. సమ్మర్‌లో వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలకు వేపాకులతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వేపాకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శరీర వేడిని తగ్గిస్తుంది :
వేపాకులలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణాలుంటాయి. ఈ వేసవి కాలంలో వేపాకులు కలిపిన నీటిని తాగడం వల్ల బాడీ కూల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంత మందికి సమ్మర్‌లో ఎండ వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. వీరు చర్మంపై వేపాకుల పేస్ట్‌ను అప్లై చేసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుందట. వేపాకులలో శరీరంలోని టాక్సిన్లను తొలగించే గుణాలున్నాయి. వేపాకుల రసం తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుందని నిపుణులంటున్నారు. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందట.
మెరిసే చర్మం కోసం వేపాకు ఫేస్ ప్యాక్- మొటిమలకు చెక్! ట్రై చేయండిలా - Neem Face Pack Benefits
చర్మ సంరక్షణకు :
వేసవి కాలంలో పిల్లలకు చికెన్ ఫాక్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సోకినప్పుడు చాలా మంది వేపాకులను గోరువెచ్చని నీళ్లలో వేసి పిల్లలకు స్నానం చేయిస్తుంటారు. వేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఈ సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
చర్మ వ్యాధులతో పోరాడుతుంది :
వేపాకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి మొటిమలు, తామర వంటి వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఈ సమస్యలతో బాధపడే వారు వేప పేస్ట్ లేదా వేప నూనెను చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల చికాకు, దురద తగ్గిపోతుందని నిపుణులు పేర్కొన్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
వేసవి కాలంలో డీహైడ్రేషన్ కారణంగా అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి వారు వేపాకులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందట. అలాగే మలబద్ధకం సమస్యను కూడా వేపాకులు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చిగుళ్లు ఆరోగ్యంగా :
చిగుళ్ల వాపు, రక్తస్త్రావంతో బాధపడేవారు వేపాకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2015లో ప్రచురించిన "జర్నల్ ఆఫ్ క్లినికల్ పీరియాంటాలజీ" అధ్యయనం ప్రకారం, వేపాకులు నమిలిన వారిలో చిగుళ్ల వాపు, రక్తస్రావం గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనలో 'యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ'కి చెందిన ప్రొఫెసర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు వేపాకులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
- వేపాకులను ఎండబెట్టి కాల్చడం వల్ల దోమలను తరిమికొట్టవచ్చు.
- వేపాకులలో ఉన్న ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తాయట.
- మధుమేహం ఉన్న వారు కొన్ని వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.