Abnormal Heartbeat Symptoms In Telugu : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు అందరికీ వస్తున్నాయి. దీంతో చాలామందికి హృదయ సంబంధించి పలు ప్రశ్నలు తలెత్తడం సహజమే. ముఖ్యంగా గుండెకు సంబంధించినంత వరకు, ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె సగటున నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది.
మనం సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు స్టెతస్కోప్‌తో గుండె నిమిషానికి ఎన్ని సార్లు స్పందిస్తుందన్న విషయాన్ని గమనిస్తారు. తద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యశాస్త్రంలో సైతం ప్రధానంగా హృదయ స్పందనల ద్వారానే ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని వైద్యులు తెలుసుకుంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి? ఎలాంటి పరిస్థితిని అసాధారణ స్థితిగా పరిగణించాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ మాటల్లో తెలుసుకుందాం.
"సాధారణ వ్యక్తి గుండె సుమారుగా 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. 60 కంటే తక్కువ సార్లు హృదయ స్పందనలు ఉంటే ఈ పరిస్థితిని 'బ్రాడీ కార్డియా' అని అంటారు. 100 సార్లు కన్నా ఎక్కువసార్లు హృదయ స్పందనలు ఉంటే 'టాకీ కార్డియా' అని పిలుస్తుంటారు. గుండె వేగం స్థిరంగా ఉండదు. శారీరక శ్రమ చేసినప్పుడు, ఆలోచనల్లో మార్పు కలిగినప్పుడు హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. దీన్ని సాధారణ స్థితిగానే భావించవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు కూడా గుండె వందసార్లు కంటే ఎక్కువగా కొట్టుకుంటే మాత్రం అప్పుడు దాన్ని అసాధారణ స్థితిగా పరగణనలోకి తీసుకోవాలి"
ఎవరికి గుండె వేగం 60 సార్లు కన్నా తక్కువగా ఉంటుంది?
"60 కన్నా తక్కువగా ఉంటే కూడా అసాధారణ స్థితి గానే భావించాలి. థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ పరిస్థితి ఉంటుంది. అలాగే ట్యూమర్లు ఉన్నవారిలో కూడా గుండె వేగం తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్ ముఖర్జీ పేర్కొన్నారు. బీపీకి సంబంధించినటువంటి మందులు తీసుకున్నప్పుడు కూడా గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది" ఆయన తెలిపారు.
హృదయ స్పందన రేటు ఎక్కువ ఉండటానికి కారణం ఇదే!
'హృదయ స్పందనలు నిమిషానికి 100 కన్నా ఎక్కువ సార్లు ఉంటే, దానికి ప్రధాన కారణం థైరాయిడ్ అవ్వవచ్చు. లేదంటే కడుపులో అల్సర్లు కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దానితోపాటు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది. అయితే కొంత మందిలో గుండెలో బ్లాకుల కారణంగా కూడా ఒక్కోసారి హార్ట్ రేట్ పెరుగుతుంది. అయితే నిజానికి హృదయ స్పందనల వేగం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే హార్ట్ రేటు 100 మీద ఉంటూ కళ్ళు తిరుగుతున్నా, చమటలు పడుతున్నా, వాంతులు అవుతున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి' అని డాక్టర్ ముఖర్జీ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నల్లద్రాక్షతో క్యాన్సర్‌కు చెక్ - గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్యలకు పరిష్కారం!
రోజుకు 22 నిమిషాల వ్యాయామం.. ఎన్నో లాభాలు.. గుండె జబ్బులకు చెక్!