Gangs Of Godavari Movie Review :
చిత్రం : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,
నటీనటులు : విష్వక్‌సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్, హైపర్ ఆది, పమ్మిసాయి, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృథ్వీరాజ్, మయాంక్ పరాఖ్, ఆయేషా ఖాన్ (ప్రత్యేక గీతం) తదితరులు.
ఛాయాగ్రహణం: అనిత్ మదాడి,
సంగీతం: యువన్ శంకర్ రాజా,
కూర్పు: నవీన్ నూలి,
కళ: గాంధీ నడికుడికర్,
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య,
రచన, దర్శకత్వం: కృష్ణచైతన్య. నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా కావడం వల్ల విడుదలకు ముందే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తింది. రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించడంతో పాటు ప్రచార చిత్రాలూ ఆడియెన్స్‌ను ఆకర్షించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే - ఎదగడం మన హక్కు అని తండ్రి చెప్పిన మాటలను నమ్మిన ఓ యువకుడు లంకల రత్నాకర్ (విశ్వక్ సేన్) తనలోని మనిషిని మానవత్వాన్ని పక్కనపెట్టి, ఎదుటివాళ్లని వాడుకుంటూ జీవితంలో ముందుకెళ్తుంటాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే స్థాయి నుంచి స్థానిక ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి రైట్‌హ్యాండ్‌గా ఎదుగుతాడు. అయితే దొరసామి, నానాజీల మధ్య రాజకీయ వైరం నడుస్తుంటుంది. అందులోకి తలదూర్చిన అతడు ఆ రాజకీయం ద్వారా తాను కోరుకున్నట్టు ఎదిగాడా, లేదా? లంకల్లోని పగ అతడిని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), రత్నమాల (అంజలి)లతో లంకల రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే - గోదావరి అనగానే పచ్చటి పల్లెసీమలు, ప్రశాంతమైన వాతావరణం చూపిస్తుంటారు. కానీ ఇందులో మాత్రం ఎరుపెక్కిన గోదావరిని చూపించారు. అక్కడి రాజకీయాలు, ఆధిపత్య పోరు, పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి జీవిత ప్రయాణాన్ని ముడిపెడుతూ కథను మలిచారు. అయితే సినిమాలో విశ్వక్ సేన్, అంజలి పాత్రలు తప్ప మిగతా ఏ పాత్రలూ అంతగా ప్రభావం చూపించవు. ఆశించిన భావోద్వేగాలు పండలేదు. ప్రతినాయకుడి పాత్రల్లోనూ బలం లేదు. చాలా సన్నివేశాలు మరీ ఎక్కువ నాటకీయతతో సాగాయి. మంచి విజువల్స్, సంగీతంతో కూడిన సీన్స్ కూడా చప్పగా సాగాయి. ఇంకాస్త ఉత్కంఠభరితంగా తెరకెక్కిస్తే బాగుండేది.
ఫస్ట్ ఆఫ్‌లో హీరోను మాస్‌గా ఆవిష్కరించిన తీరు, పోరాటాలు, అంజలి పాత్ర జర్నీ ఆకర్షణగా నిలుస్తాయి. హీరో పాత్ర ఎదుగుదలను చూపెట్టిన తీరు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో నదిలో సాగే ఓ సీన్ బాగుంది. చివర్లో తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో సాగే సీన్స్‌లో ఎమోషన్స్‌ను పండించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రభావం చూపించలేదు.
ఎవరెలా చేశారంటే - లంకల రత్నాకర్‌గా విశ్వక్స్ సేన్ మాస్ పాత్రకు తగ్గటే హుషారుగా నటించారు. సాంగ్స్, ఫైట్స్ బాగా చేశారు. అంజలి పాత్ర అర్థవంతంగా ఉంది. ఆమె అద్భుతంగా నటించారు. నేహాశెట్టి అందంగా కనిపించింది. గోపరాజు రమణ, నాజర్, సాయికుమార్, పమ్మి సాయి, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు అతిపెద్ద బలం. కెమెరా విభాగం అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది. ప్రతీ ఫ్రేమ్ విలువైనదిగా ఉంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా మరో హైలైట్. మోత మోగిపోద్ది, సుట్టంలా సూసి పాటలు బాగున్నాయి. కళ, కూర్పు తదితర విభాగాల పనితీరు కూడా బాగుంది. రచయితగా కృష్ణచైతన్య తనదైన ముద్ర వేసినప్పటికీ చాలాచోట్ల లోటు కనిపించింది. ఉత్కంఠతగా సాగితే మరింత బాగుండేది. గోదావరిలో ఎరుపు, గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎరుపెక్కిన గోదావరి
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ- విశ్వక్ మాస్ షో ఎలా ఉందంటే? - Gangs Of Godavari
మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో! - Hero sivakarthikeyan