Vijay Devarkonda Sukumar Meets Allu Arjun : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో బన్నీ కుటంబసభ్యులతో పాటు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలానే బన్నీ ఇంటికి రాగానే, ఆయన్ను పలువురు సినీ ప్రముఖులు కలుస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి తాజా పరిణామాల గురించి చర్చిస్తున్నారు. పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు తదితరులు వెళ్లి బన్నీని కలిశారు. ఇక అల్లు అర్జున్‌ను కలిసిన సుకుమార్ అయితే భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే? - హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించిన పుష్ప 2 బెనిఫిట్ షోకు (డిసెంబర్ 4) అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు, థియేటర్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలానే ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ విషయం భారతీయ సినీ చరిత్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలువురు ప్రముఖులు అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. బన్నీని అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
జైలు నుంచి బన్నీ ఇంటికి - హత్తుకుని ఏడ్చిన స్నేహా రెడ్డి
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత 'పుష్ప 2' కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?