Tollywood Actress Suryakantham 100th Birth Anniversary : సూర్య కాంతం అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియదుకానీ, అప్పటి తరానికి మాత్రం బాక్సాఫీస్ గయ్యాళి అత్త. ఇంకా చెప్పాలంటే గంప గయ్యాళీ తనానికి ఆవిడ కేరాఫ్ అడ్రస్. ఓసి నా కోడలా అంటూ మెటికెలు విరుస్తూ శాపనార్థాలు పెడుతూ సినిమాలో సూటిపోటి మాటలతో ఆడిపోసుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారామె. అలా తెరపై ప్రతి ఒక్కరిని భయపెట్టే ఈమెను ఓ సాధారణ మహిళ తెగ భయపెట్టిందట. నేడు (అక్టోబరు 28) సూర్యకాంతం శతజయంతోత్సవం సందర్భంగా ఆమెను భయపెట్టిన సాధారణ మహిళ ఎవరు? అసలు అప్పుడు ఏం జరిగింది? సూర్యకాంతం ఎందుకు భయపడాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
సాధారణంగా సూర్య కాంతం బయట చాలా శాంత స్వభావి. అంతేకాదు, చిత్రీకరణ సమయంలో తన ఇంటి నుంచి పిండి వంటలు చేసి సెట్‌లోని ప్రతి ఒక్కరికీ పెట్టేవారట. ఒకసారి సూర్యకాంతం మద్రాసు నుంచి నెల్లూరుకు కారులో వెళ్లారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు, ఒక గ్రామం దగ్గర కారు ఆగిపోవడం, డ్రైవరుతో పాటు ఇతరులు కారుకు ఏమైందోనని దిగి చూస్తున్నారట.
అప్పుడు నెత్తిమీద కుండ పెట్టుకుని, నీళ్లు తెచ్చుకోవడానికి రోడ్డు దాటుతున్న ఒక మహిళ, కారులో కూర్చొన్న సూర్య కాంతంను చూశారు. వెంటనే నేరుగా కారు దగ్గరకొచ్చి - "ఏమ్మా! సినిమాల్లో గయ్యాళి వేషాలు వేసే సూర్యకాంతానివి నువ్వే కదూ? ఎన్ని సినిమాల్లో ఎంతమంది కాపురాల్లో చిచ్చుపెడతావమ్మా? ఎంతమందిని విడదీస్తావు? ఇంకో పనిలేదా నీకు? హాయిగా కార్లో తిరుగుతున్నావా? ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావు? అసలు ఇదేం బుద్ధి నీకు?" అని సదరు మహిళ తన మాటలతో సూర్య కాంతాన్ని భయపెట్టించిందట! ఆ మాటలకు కారులో ఉన్న సూర్యకాంతం కిక్కురు మనకుండా కూర్చుందట. ఎందుకంటే తిరిగి ఏమైనా అంటే, నెత్తిమీద ఉన్న కుండను తన నెత్తిమీద బోర్లిస్తుందేమోనని భయపడిపోయారట సూర్యకాంతం. తొందరగా కారు బాగుచేసి, అక్కడి నుంచి తనను తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పారట.
2 నెలల్లో 7యాక్షన్ మూవీస్- లిస్ట్‌లో 'పుష్ప', 'కంగువా'- బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా!