Telugu Producers For Other Language Movies : నటీనటులు, డైరెక్టర్లు లాగానే నిర్మాతలు కూడా భాషా బేధం లేకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలను నిర్మించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. గతేడాది దిల్ రాజు దళపతి విజయ్‌తో 'వారిసు' అనే సినిమాను నిర్మించారు. అది తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి టాక్ అందుకుంది. అదే ఊపుతో ఇప్పుడు దిల్ రాజు మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
తెలుగులో హిట్ అయిన 'ఎఫ్ 2' సినిమాను బోనికపూర్‌తో కలిసి హిందీలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే జెర్సీ, హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాలను ఆయన హిందీలో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజులాగే మరికొందరు స్టార్ నిర్మాతలు ఇతర భాషల సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే ?
మైత్రి మూవీ మేకర్స్ : మహేశ్ బాబు 'శ్రీమంతుడు' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ సంస్థ. అప్పుడు హిట్ అందుకున్న మైత్రి, గత తొమ్మిదేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించింది. అయితే తెలుగులోనే అన్ని సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్లో రానున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. దీంతో పాటు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌తో 'నడిగర్' అనే సినిమాను నిర్మిస్తోంది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లోనూ మైత్రీ తన జెండా పాతింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నిదేఓల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాతో పాటు, సల్మాన్ ఖాన్‌తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ : ఈ సంస్థ కూడా ఇప్పుడు పర భాషా చిత్రాల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఒక సినిమా చేయనుంది. అంతేకాకుండా ఇటీవలే సూపర్ హిట్ అయిన 'బేబీ' సినిమాను కూడా హిందీలో నిర్మించనుంది.
పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థ : ఇప్పటికే కోలీవుడ్‌లో మూడు చిత్రాలను, శాండిల్‌వుడ్‌లో మూడు చిత్రాలను నిర్మించింది. తాజాగా బెంగాలీలో కాళీ సినిమాను నిర్మిస్తోంది.
వారాహి చలన చిత్రం : 'అందాల రాక్షసి' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారాహి సంస్థ ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలను నిర్మించింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడితో తెలుగు, కన్నడ బాషల్లో ఒక సినిమాను నిర్మించనుంది.
గీత ఆర్ట్స్ : ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ ఇప్పటికే పలు చిత్రాలను హిందీలో నిర్మించింది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో 'రామాయణ్' సినిమాను తెరకెక్కిస్తున్నారు.