Telangana Film Exhibitors: తెలంగాణలో సింగిల్ థియేటర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను తెలిపారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్లు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని గుర్తు చేశారు.
డిమాండ్లు ఇవే : 'కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు షోలను ప్రదర్శించము. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు కచ్చితంగా పర్సంటేజీ ఇవ్వాల్సిందే. ఇకపై అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించము. మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ ఇస్తేనే ప్రదర్శన చేస్తాం. కల్కి 2898 ఏడీ, పుష్ప 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 సినిమాలకు మాత్రం మినహాయింపు ఉంది. ఇతర సినిమాలను మాత్రం కచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శన చేస్తాం. జులై 1 వరకు టాలీవుడ్ సినీ ప్రొడ్యూసర్లకు గడువు ఇస్తున్నాం. నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు అన్నారు.
థియేటర్లు బంద్: ఇదిలా ఉండగా ఈనెల 16 నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసి వేశారు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఎన్నికలు జరగడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. దీంతో రాష్ట్ర థియేటర్ల యాజమాన్య సంఘం రెండు వారాలు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ చూపించింది. చిన్న సినిమాలే థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. కానీ అవి అంతగా ఆకట్టుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు పెద్దగా రావట్లేదు. వచ్చే కొద్ది మంది ఆడియెన్స్ ద్వారా వస్తున్న వసూళ్లు కరెంట్, రెంట్‌కు కూడా సరిపోవట్లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని యజమానులు వాపోతున్నారు.
రాష్ట్రంలో అప్పటివరకు సినిమా ప్రదర్శనలు నిలిపివేత - TELANGANA THEATRES BANDH