SSMB 29 Rajamouli Mahesh Babu Movie : దర్శకధీరుడ రాజమౌళి తన తర్వాత చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే ఈ సినిమా కోసం రాజమౌళి తన టీమ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిసింది. జక్కన్న చాలా సినిమాలకు పని చేసిన సెంథిల్ కుమార్ స్థానంలో పీఎస్ వినోద్‌ను, వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ కన్నన్ను తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. పీఎస్ వినోద్ పంజా, అరవింద సమతే, అల వైకుంఠపురములో సహా పలు చిత్రాలకు పని చేయగా కమలాకన్నన్ బాహుబలి 2, ఈగ, మగధీర చిత్రాలకు వర్క్ చేశారు. వీరిద్దరు మాత్రమే కాకుండా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ స్థానాల్లో వేరే వాళ్లని భర్తీ చేయాలని జక్కన్న అనుకుంటున్నారట. అయితే సంగీత విషయంలో ఎటువంటి మార్పు లేదు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణినే కొనసాగించనున్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఈయన్ను మార్చే అవకాశమే లేనట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ SSMB29 చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు మొదటి నుంచి మూవీటీమ్ చెబుతూనే వస్తోంది. మొత్తంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్‌గా తెరకెక్కించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లొకేషన్ల వేట కూడా పూర్తైందని తెలిసింది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త రూపంలో మహేశ్ బాబును జక్కన్న చూపించనున్నారట. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో మహేశ్ సందడి చేయనున్నారు.
సాయి పల్లవి సినిమా రీ రిలీజ్ - ఐదు రోజుల్లో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్!
పవర్ ఫుల్‌గా 'లాల్ సలామ్' ట్రైలర్ - రజనీ యాక్షన్ అదిరిపోయిందంతే!