Ramoji Rao Introduced Flim Stars: జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించిన రామోజీరావు 'ఈనాడు' దినపత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. టీవీ రంగం ద్వారా వేలాది నూతన నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. టీవీ ప్రపంచంలో ఆయన చెరగని ముద్రవేశారు. ఆయన నెలకొల్పిన ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ ఛానళ్లతో బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేయగా.. ఈటీవీ వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. రామోజీ ఆలోచనల నుంచి పుట్టిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించారు.
వందల మంది గాయనీ, గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతోమంది సామాన్యులు రామోజీ ప్రోత్సాహంతో వినోద ప్రపంచంలో రాణించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా యువ నటీనటులు పరిచయం కాగా తారలుగా ఎదిగిన ఎంతోమంది అగ్రశ్రేణి నటులుగా ఉన్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'పీపుల్ ఎన్‌కౌంటర్' సినిమాతో శ్రీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా 'నిన్ను చూడాలని' చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా పరిచయమయ్యారు.
మాస్టర్ తరుణ్ అనే పేరును 'మనసు మమత' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయగా ' నువ్వేకావాలి'తో కథానాయకుడిగా తరుణ్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. తెలుగులో ఘనవిజయం సాధించిన 'నువ్వేకావాలి' చిత్రాన్ని హిందీలో 'తుఝే మేమరీ కసమ్' పేరుతో నిర్మించిన చిత్రంతో శ్రియ, జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ తొలిసారిగా వెండితెరపైకి వచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన 'ఇష్టం'తో తొలిసారిగా తెలుగు తెరపైకి వచ్చిన శ్రియా ప్రస్తుతం అగ్రతారగా వెలుగొందుతున్నారు.
ఛాయాగ్రాహకుడిగా ఉన్న తేజ దర్శకుడైంది ఈ సంస్థ నుంచే. ఆయన దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'చిత్రం' సినిమా ద్వారా 27మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయమయ్యారు. దివగంత నటుడు ఉదయ్‌కిరణ్ ఈ సినిమాతోనే కథానాయకుడు అయ్యారు. గాయనిగా ఉన్న ఎస్.జానకి సంగీత దర్శకురాలైంది కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రంతోనే. ఈ చిత్రంలోనే ప్రముఖ కన్నడ నటుడు వినోద్‌కుమార్ తెలుగులో పరిచయమయ్యారు. మల్లికార్జున్, ఉషా, గోపికా పూర్ణిమలాంటి గాయనీ గాయకులను శ్రోతలకు చేరువ చేసింది కూడా ఈ సంస్థే. ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్తకి సుధాచంద్రన్ జీవితాన్ని ఆమెతోనే ఆ పాత్రను తెరమీద ఆవిష్కరించారు. అలాగే చరణ్‌రాజ్, యమున, వరుణ్‌రాజ్, రీమాసేన్, రిచా పల్లోడ్, తనీశ్, మాధవీలతోపాటు ఎందరో నటీనటులు చిత్రసీమకు పరిచయమయ్యారు.
ఇవే కాదు రాజకీయ, పాత్రకేయ రంగాల్లో ఎందరో తన సంస్థల నుంచి వెళ్లి ఆయన స్ఫూర్తితోనే నేడు అగ్రస్థాయిలో రాణిస్తున్నారు. తెలుగుదేశం కీలక నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఇటీవల ఎంపీగా గెలుపొందిన అప్పలనాయుడు, YCP నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మెదక్ నుంచి ఇటీవల ఎంపీగా గెలుపొందిన భాజపా నేత రఘునందన్‌రావు గతంలో 'ఈనాడు' సంస్థల్లో పనిచేసిన వారే. ఇక పాత్రికేయ రంగానికి పుట్టినిల్లుగా చెప్పుకునే 'ఈనాడు' సంస్థల నుంచే వేలాది మంది నేడు జర్నలిజంలో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారు. ఇలా ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చిన మహాయోధుడు రామోజీరావు మరణం వేలాది మందిని దుఖసాగరంలో ముంచేసింది.
'తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు' - Ramoji Rao Passed Away
కథను మాత్రమే విశ్వసించేవారు - సినిమాల్లో రామోజీ అభిరుచే వేరు - Ramoji Rao Usha Kiron Movies