Priyanka Chopra Movie Career : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత 20ఏళ్లుగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. గ్లామర్, డీ గ్లామర్ ఇలా పాత్ర ఏదైనా అలవోకగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. అలా తన నటనతో ప్రియాంక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ దాకా ఎదిగిపోయింది. అయితే మొదట్లో ఆమె సినిమా రంగంలోకి రావడానికి ఒప్పుకోలేదట. ఆమెకు నటనపై అస్సలు ఆసక్తి లేదు. ఔను ఇది నిజమే! సైకాలజిస్ట్ అవ్వాలనేది తన కోరిక అని ప్రియాంక తల్లి మధు చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సినిమాలో నటించడం ఇష్టం లేని ప్రియాంక తొలి ప్రాజెక్ట్‌కు కన్నీళ్లు పెట్టుకుంటూనే అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్లు మధు చోప్రా వెల్లడించారు. 'అప్పట్లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రియాంకకు సినిమాల్లో అవకాశాలు వరుస కట్టాయి. కానీ, తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఏ మాత్రం లేదు. స్టడీస్ కంటిన్యూ చేస్తూ, క్రిమినల్ సైకాలజిస్ట్ లేదా ఏరోనాటికల్ ఇంజినీర్ అవ్వాలనేది ఆమె లక్ష్యం'
'కానీ, విధి ప్రణాళికలు వేరే ఉంటాయి కదా. 'వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క సినిమాలో నటించు, చదువులు ఎక్కడికీ పోవు. ఆ తర్వాత ఈ రంగంలో కొనసాగించాలా? వద్దా? అనేది నీ ఇష్టం' అని నేనే తనపై కాస్త ఒత్తిడి తెచ్చాను. నా బలవంతంతోనే తను సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. తన తొలి చిత్రానికి కన్నీళ్లు పెట్టుకుంటూనే సంతకం చేసింది' అని ప్రియాంక తల్లి మధు ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
అలా 2002లో 'తమిళన్' అనే తమిళ సినిమాతో ప్రియాంక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాదికి కనీసం 5-6 సినిమాలతో బిజీబిజీగా గడిపేసింది. 'క్రిష్', 'ముజ్సే షాదీ కరోగి', 'డాన్', 'ఓమ్ శాంతి ఓమ్' లాంటి బ్లాస్‌బస్టర్ సినిమాలతో అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది.