Siva Karthikeyan SaiPallavi Amaran Theatre Petrol Bomb : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. రీసెంట్‌గానే ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది.
అయితే తాజాగా తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ అమరన్ సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్ దగ్గర ఊహించని సంఘటన ఎదురైంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సదరు థియేటర్‌పై పెట్రోల్ బాంబులతో దాడికి దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి.
ఈ సంఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారు దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. స్థానిక గొడవల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.
అమరన్ నిషేధించాలి - 'అమరన్' చిత్రంలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించరాని, దానిని వ్యతిరేకిస్తూ తమిళనాడు చెన్నైలోని పలు చోట్ల ఎస్‌డీపీఐ తరఫున వరుస ఆందోళనలు ఈ మధ్య జరిగాయి. రీసెంట్గా ఆళ్వార్‌పేటలోని హీరో కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్‌నేషనల్ కార్యాలయం ఎదురుగా పలువురు ఆందోళనకు దిగారు.
కాగా, దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన చిత్రాల్లో 'అమరన్' ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2014లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముకుంద్ వరదరాజన్ మృతి చెందారు. ఆయన జీవిత ఆధారంగానే ఈ అమరన్‌ను తెరకెక్కించారు. సినిమాలో ఆర్మీ ఆఫీసర్ ముకుంద్‌గా శివకార్తికేయన్, అతడి భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రశంసలను అందుకున్నారు. వీరిద్దరి నటన, దర్శకుడి టేకింగ్‌పై సినీ దిగ్గజాలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను ఆదరించినందుకు మూవీ టీమ్ కూడా అన్ని ప్రముఖ నగరాల్లోనూ సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఇకపోతే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించగా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మించారు.
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సింగర్స్! - ఒక్కటైన అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా