NTR Saif Alikhan Devara Movie : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్‌కు కూడా సుపరిచితమే. ఆ మధ్య ప్రభాస్ ఆదిపురుష్‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన ఆయన తాజాగా ఎన్టీఆర్ దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆయన భైర అనే పాత్రలో విలన్‌గా కనిపించి మెప్పించారు. దేవరతో(ఎన్టీఆర్) ధీటుగా పోటీపడుతూ నటించి అదరగొట్టారు. దేవరను అడ్డు తొలగించుకుని సంద్రాన్ని శాసించాలనుకునే పాత్రలో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా తాజాగా సైఫ్ అలీఖాన్ ఓ ఆంగ్ల వెబ్ సైట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో టాలీవుడ్ ఆడియెన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్ తమ అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని పేర్కొన్నారు. అలాగే టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు.
"తెలుగు ఆడియెన్స్ సినిమాలో లీనమైపోతారు. తమ అభిమాన హీరోలను కూడా దేవుళ్లలా భావిస్తారు. అలాగే దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకులకు ఏం కావాలనే పాయింట్‌తోనే సినిమాను తీస్తారు. ప్రతి కథపై స్పష్టమైన, బలమైన అవగాహనతో ఉంటారు. బాహుబలి గొప్ప పౌరాణిక, చరిత్రాత్మకమైన సినిమా. వారు షూట్ చేసిన విధానం ఓ అద్భుతం. మనం ఒకే దేశంలో ఉన్నప్పటికీ భిన్నమైన అభిరుచులు ఉంటాయి. భాష కూడా భిన్నంగా ఉంటుంది. కానీ, కెమెరా ఆన్ చేస్తే అంతా మారిపోతుంది. భాష కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. దేవరలో డైలాగ్స్ విషయంలో కొరటాల శివ నాకు చాలా సాయం చేశారు. ముంబయి యాక్టర్‌ను అయినప్పటికీ కూడా తెలుగులో చాలా సౌకర్యవంతంగా పని చేశాను. దక్షిణాది నుంచి వచ్చిన ఎన్నో చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. వారు హీరోలను చూపించే తీరు నన్ను ఆశ్చర్యపరుస్తుంది" అని చెప్పుకొచ్చారు.
కాగా, దేవర చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 27) విడుదలై హిట్ టాక్‌ను(Devara Movie) దక్కించుకుంది. ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య యాక్షన్ సీన్స్, అనిరుధ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ 'దేవర' మూవీ రివ్యూ - ఎర్ర సముద్రం పోటెత్తింది! - DEVARA MOVIE REVIEW