Apudo Ipudo Epudo Movie Review : 'స్వామి రారా', 'కేశవ' తర్వాత నిఖిల్ - సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. చడీ చప్పుడు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే ? - రేసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకునే రిషి (నిఖిల్), తార (రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అవుతుంది. దీంతో రేసర్ అవ్వాలన్న తన లక్ష్యం కోసం లండన్ వెళ్లిన రిషి, ట్రైనింగ్‌తో పాటు పార్ట్ టైమ్‌గానూ పని చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో అక్కడ తులసితో (దివ్యాంశ కౌశిక్) పరిచయం ఏర్పడి, మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి వరకు వెళ్తాడు. కానీ అంతలోనే తులసి మాయం అవ్వడం, ఎలా మాయం అయిందో తెలియక రిషి సతమతమవ్వడం, ఈ క్రమంలోనే రిషి మాజీ లవర్ తార మళ్లీ లండన్‌కు రావడం, ఈ గ్యాప్‌లో లోకల్ డాన్ బద్రీనారాయణ (జాన్ విజయ్) ఎంట్రీ ఇవ్వడం, ఇలా అన్నీ జరిగిపోతాయి. వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే? - ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి లవ్ స్టోరీని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అయితే క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని ఇవ్వదు. అలాగాని ప్రేమ కథలోనూ బలం కనిపించదు. కానీ ఈ కథలో బోలెడన్ని మలుపులు, ఫ్లాష్ బ్యాక్‌లు ఉంటాయి. కానీ ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించవు. సహజత్వం లేని సన్నివేశాలు, అర్థం లేని మలుపులు, ఆకట్టుకోని పాటలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా నడుస్తుంది. దివ్యాంశ కౌశిక్ పాత్రని తప్ప, మరే పాత్ర కూడా అంత ప్రభావం చూపదు. ఇంకా చెప్పాలంటే కాలం చెల్లిన కథతో చేసిన ఓ సాదాసీదా ప్రయత్నమిది.
ఎవరెలా చేశారంటే? - నిఖిల్ పాత్రకు తగ్గట్టుగా లుక్ బానే ఉంది. నిఖిల్, రుక్మిణీ వసంత్ జోడీ బాగుంది. రుక్మిణీకి ఇదే తొలి తెలుగు సినిమా. ఆమె గ్లామర్, లుక్స్‌తో ఆకట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ పాత్ర సినిమాకే హైలైట్. ఇంకా జాన్ విజయ్, అజయ్ పాత్రలు బాగానే అనిపించాయి. హర్ష, సత్య, సుదర్శన్ అప్పుడప్పుడు నవ్వించారు.
టెక్నికల్‌గా కెమెరా పని తనం బాగుంది. మాటలు అక్కడక్కడా ప్రభావం చూపించాయి. దర్శకుడు సుధీర్ వర్మ తన మార్క్ థ్రిల్లింగ్ అంశాల్ని చూపించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. నిర్మాణం బాగుంది.
చివరిగా : అప్పుడెప్పుడో రావల్సిన సినిమా ఇది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'గేమ్‌ఛేంజర్' న్యూ పోస్టర్- ఈసారి కియారా లుక్ రిలీజ్!
'బాహుబలి సినిమాకు స్ఫూర్తి సూర్యనే- ఆయనతో సినిమా చేయాలకున్నా కానీ!'