NBK 50 Years Celebrations : ఆయన డైలాగ్ చెబితే థియేటర్ దద్దరిల్లిపోతుంది! స్టెప్పులేస్తే వేస్తే ప్రేక్షకుల ఒళ్లు ఊగిపోతుంది! వయసేమో అరవై నాలుగు కానీ ఆయన మనసు మాత్రం పద్నాలుగు. ముఖంలో గాంభీర్యం కానీ మాటల్లో మాత్రం పసితనం. అందుకే అభిమానులందరూ ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తుంటారు. ఆయనంటే వారికి అమితమైన అభిమానం. వెండితెరపై రికార్డుల రారాజైన ఆయనే, నిజజీవితంలో ఆత్మీయుల ఆత్మబంధువువైన ఆయనే. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా కీర్తి గడించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన సినీ తెరంగేట్రం చేసి 50 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు ఆయన మాటల్లోనే.
ఆ రోజు నాన్న నాపై కోపడ్డారు
చిన్నప్పట్నుంచీ నాన్నగారి ప్రభావం నా పైన ఎంతో ఉండేది. సినిమాలు చూస్తూ పెరగడం, అలాగే ఆయన గురించి గొప్పగా వినడం వల్ల నాకు కూడా సినిమాల్లోకి రావాలనే ఆలోచన మనసులో పడింది. అయితే ఆ విషయాన్ని నేను ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. నాన్నగారు కూడా సినిమా ప్రభావం మా మీద పడకుండానే చూశారు. మమ్మల్ని షూటింగ్ లొకేషన్లకు తీసుకెళ్లింది కూడా చాలా తక్కువ. అయితే నన్ను మాత్రం సినిమాల్లోకి తీసుకురావాలని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు.
Balakrishna Tatamma Kala Movie : అది 1974, నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఉన్నట్టుండి ఓ స్కూలుకు సెలవు పెట్టించి మరీ నన్ను చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడ జరిగే ఓ షూటింగ్ వద్దకి తీసుకెళ్లి- సీన్స్ వివరించి ఎలా నటించాలో చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేయిస్తున్నారని. అదే నాన్నగారు డైరెక్ట్ చేసిన 'తాతమ్మ కల'. ఆ చిత్రంలో భానుమతిగారి మునిమనవడి పాత్ర నాది.
అప్పుడు దూరంగా కూర్చున్న ఆమె వద్దకు నడుచుకుంటూ వెళ్లమన్నప్పుడు నాన్నగారు నటించిన 'నిండు మనసులు' గుర్తొచ్చింది. ఆ సినిమాలో ఆయన గర్వంగా నడిచొచ్చినట్టే నేను కూడా నడిచాను. అది చూసి నాన్న గారు వెంటనే 'అరేయ్ నీకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? రౌడీలా ఏమిటా నడక' అంటూ నాపై కోప్పడ్డారు. అయితే నేను వెంటనే 'ఇది మీ నడకే' అని చెప్పాలనుకున్నా. కాన్ని ఆయన్ను చూసి భయంతో ఆగిపోయాను. అయితే కాసేపటికి తమాయించుకుని నా భయాన్ని పక్కనపెట్టి మరీ నటించాను. ఇక సింగిల్ టేక్‌లోనే నా సీన్‌ను ఓకే చేశారు నాన్నగారు. ఆ రోజు 'రామారావుగారూ, మీరు అనవసరంగా పిల్లాడ్ని భయపెట్టకండి. అబ్బాయి ఎంతో చక్కగా నటించాడు. చూడండి మీ పేరు నిలబెడతాడు' అని దీవించారు భానుమతిగారు. ఆమె వాక్కు వృథా పోలేదు.
మాస్ డైలాగ్స్‌కు 'బాలయ్య' కేరాఫ్ ఆడ్రస్ - కెరీర్లో ఇవే ఫేమస్! - Balakrishna Famous Dialogues